రూ.828 కోట్లతో 71,011 ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫార్మర్లు : సదరన్ డిస్కమ్ సీఎండీ జితేశ్ వి.పాటిల్

రూ.828 కోట్లతో 71,011 ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫార్మర్లు : సదరన్ డిస్కమ్ సీఎండీ జితేశ్ వి.పాటిల్

హైదరాబాద్, వెలుగు: సదరన్​ డిస్కమ్​ పరిధిలో గడిచిన 32 నెలల కాలంలో రూ.828 కోట్లతో 71 వేల 11 డిస్ట్రిబ్యూషన్​ ట్రాన్స్​ ఫార్మర్లను ఏర్పాటు చేసినట్లు సీఎండీ జితేష్​ వి.పాటిల్​ శనివారం ప్రకటించారు.  రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ, గృహ, వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో విద్యుత్ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో, వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు ఈ డీటీఆర్‌‌‌‌‌‌‌‌లను ఏర్పాటు చేశామని తెలిపారు. కొత్త కనెక్షన్లు, లోడ్ పెరుగుదల, పట్టణీకరణ, పారిశ్రామిక విస్తరణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్​ పంపిణీ వ్యవస్థ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచామన్నారు.

వీటి ఏర్పాటుతో ఇప్పటికే ఉన్న ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫార్మర్లపై అదనపు భారం తగ్గిందన్నారు. ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫార్మర్ ఫెయిల్యూర్లు, లో-వోల్టేజ్ సమస్యలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయని వివరించారు. వ్యవసాయ పంపుసెట్లకు మెరుగైన విద్యుత్ సరఫరాతో సాగునీటి అవసరాలు సకాలంలో తీర్చుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. హైదరాబాద్​ మెగా సిటీ, క్యూర్​ పరిధిలో కొత్త కాలనీలు, అపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ సముదాయాలు, గేటెడ్ కమ్యూనిటీలు, పట్టణ విస్తరణకు అనుగుణంగా డీటీఆర్‌‌‌‌‌‌‌‌ల సంఖ్య పెరగడంతో విద్యుత్ సరఫరా నాణ్యత మెరుగుపడిందన్నారు.