ఓరుగల్లులో టర్కీ ప్రతినిధుల పర్యటన.. రామప్ప ఆలయం, కోట సందర్శన

ఓరుగల్లులో టర్కీ ప్రతినిధుల పర్యటన.. రామప్ప ఆలయం, కోట సందర్శన

వెంకటాపూర్ (రామప్ప) / గ్రేటర్​ వరంగల్/ ధర్మసాగర్​, వెలుగు: భారత విద్యా విధానంపై అధ్యయనంలో భాగంగా తెలంగాణలో పర్యటిస్తున్న టర్కీ దేశ ప్రతినిధులు శుక్రవారం రామప్ప దేవాలయం, ఓరుగల్లు కోటతో పాటు ముప్పారం కస్తూర్బా పాఠశాలను సందర్శించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డితో కలిసి చారిత్రక కట్టడాలను సందర్శించిన ప్రతినిధులకు గైడ్లు కాకతీయుల చరిత్ర, శిల్పకళా విశిష్టతలను వివరించారు.

రామప్ప ఆలయ నిర్మాణంలో ఉపయోగించిన తేలికపాటి, నీటిలో తేలియాడే ఇటుకల ప్రత్యేకతను ఎమ్మెల్సీ వివరించారు. అనంతరం ముప్పారం కస్తూర్బా పాఠశాలను సందర్శించిన టర్కీ ప్రతినిధులు మసూద్, నూరుల్లాఖాన్ తెలంగాణలోని రెసిడెన్షియల్ విద్యావిధానం, పాఠశాలలోని సౌకర్యాలు, నాణ్యమైన విద్యను ప్రశంసించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ఇంటిగ్రేటెడ్, తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు. తెలంగాణ విద్యా విధానంపై అధ్యయనం కోసం తమ పర్యటన మూడు నెలల పాటు కొనసాగుతుందని తెలిపారు. గ్రామ సర్పంచ్ గుంటిపల్లి రేణుక ప్రతినిధులకు స్వాగతం పలికి సన్మానించారు. కార్యక్రమంలో పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పులగం దామోదర్ రెడ్డి, అశ్విన్ బాల్ రెడ్డి, ఎంపీడీవో అనిల్ కుమార్, కస్తూర్బా పాఠశాల ప్రత్యేక అధికారి మాధవి, గ్రామ కార్యదర్శి ఆకార సురేష్ తదితరులు పాల్గొన్నారు.