2027 ఫిబ్రవరి నుంచి జరిగే జాతీయ సెన్సెస్‌లో ఎస్సీ, ఎస్టీల, మతాల డాటా సేకరించనున్నారు. కానీ, ఓబీసీల డాటా సేకరించడానికి కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా ఉంది. కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఇచ్చిన ప్రశ్నావళిలో ఎస్సీ, ఎస్టీ, కేస్ట్ అని మాత్రమే ఉంది. అంటే అందరి వ్యక్తులను పేర్లు, ఇతర వివరాలతోపాటు కులంపేరు కూడా అడుగుతారు. అయితే ఆ పద్ధతిలో 2011 సోషియో, ఎకనామిక్ సర్వేలో ఇదేవిధంగా కులాల పేర్లు అడగగా దాదాపు 46 లక్షల కులాలు నమోదు చేసుకున్నారు.
కులాల పేర్లు రాయడంలో సమస్యలు.. గ్రూపు, కులాలు విడిపేర్లు రాయడం వల్ల, వివిధ భాషల్లో ఉన్న కుల పేర్లను ఇంగ్లిష్‌లో రాయడం వల్ల నిజానికి ఉన్న కులాలు కన్నా వేలరెట్లు ఎక్కువ కులాలు నమోదయ్యాయి. ఇప్పుడు ఇంకా ఎక్కువ నమోదు అవుతాయి.
ప్రతి కేంద్ర జనాభా లెక్కల్లో ఎస్సీ, ఎస్టీల కులాలు దాదాపు ఆయా రాష్ట్రాల్లో ఉన్న పేర్లతో వారి సంఖ్యను నమోదు చేస్తున్నారు. మొత్తం దేశ జనాభాకు వారి పర్సంటేజీని కూడా లెక్క తీస్తున్నారు. అదే లెక్కన వారి రిజర్వేషన్ శాతాన్ని అంచనా కడుతున్నారు. ఓబీసీ కులాల లెక్కకూడా అలానే తీయవచ్చు. అందుకు రాష్ట్రాల్లోని ఓబీసీ కమిషన్ల దగ్గర ఉన్న ఓబీసీ కులాల లిస్టు కేంద్రం తెప్పించుకుని ఆయా రాష్ట్రాల్లో అదే పేర్లతో ఎన్యుమరేటరు కులాల పేరు ఎంటర్ చేసి వాటికి కోడ్ నెంబర్ ఇవ్వడం ద్వారా అన్ని ఓబీసీ కులాల లెక్కలు కచ్చితంగా తీయవచ్చు.
జనరల్ కులాల వ్యతిరేకత
కులాల లెక్కలు దేశమంతటా తీయడానికి 1951 నుంచి జనరల్ కులాలు వ్యతిరేకిస్తూనే ఉన్నాయి. ఇతర రాష్ట్రాలలో కూడా కుల సర్వే చేయడాన్ని రిజర్వేషన్ బయట ఉన్న కులాలు వ్యతిరేకించాయి. ఉదాహరణకు తెలంగాణలో సోషియో ఎకనామిక్, ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్‌మెంట్, కేస్ట్ సర్వే చేసినప్పుడు జనరల్ కులాలు బిహార్‌లో వ్యతిరేకించాయి.
అతి బలవంతంగా ఆ సర్వేలు చేయాల్సివచ్చింది. కేంద్రంలో కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. దేశస్థాయిలో ఏ కులం లెక్క ఎంత అని కచ్చితంగా ప్రభుత్వం లెక్కలు ప్రకటించడానికి జనరల్ కులాలు బాగా వ్యతిరేకంగా ఉన్నాయి.
ఓబీసీ రిజర్వేషన్ తీసెయ్యాలనే ఆలోచన
ఒక్కసారి ఓబీసీ కులాల లెక్కలు కచ్చితంగా తేలాయంటే ఆ లెక్కలు చాలాకాలం సామాజిక న్యాయ ఉద్యమాలకు ఆయుధాలు అవుతాయి. ఇప్పటివరకు 1931 జనాభా లెక్కల ఆధారంగా మాత్రమే చర్చ జరుగుతోంది. మండల్ కమిషన్ రిపోర్టు కూడా 1931 ఓబీసీ కులాల లెక్కలపై ఆధారపడి మాత్రమే 52శాతం అంచనాకు వచ్చింది. అది నిజం కావచ్చు. కాకపోవచ్చు. అయితే దేశస్థాయిలో ఓబీసీల డిమాండ్ కచ్చితమైన జనాభా లెక్కల కోసం జరుగుతుండగా చాలా జనరల్ కులాల్లో రిజర్వేషన్లను బలంగా వ్యతిరేకించాలనే ఆలోచన పెరుగుతున్నది.
కాక్రోచ్ జనతా పార్టీ జంతర్ మంతర్ ఉద్యమం తరువాత దేశంలో అన్ని కులాల యువతలో ఒక కొత్త ప్రజాస్వామ్య చైతన్యం కనబడుతున్నది. ఇది గమనించిన కన్సర్వేటివ్ కులశక్తులు రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమం మొద లెట్టాలనే ఆలోచనను జనరల్ కులాల్లో చేస్తున్నాయి.
జాతీయ కాంగ్రెస్ ఒక్కటే ఓబీసీ లెక్కలు అడుగుతున్నది
దేశస్థాయిలో కాంగ్రెస్ ఒక్కటే ఓబీసీ లెక్కలు డ్రాప్ డౌన్ పద్ధతిలో తీయాలని అడుగుతున్నది. బీజేపీ ఈ వ్యవహారాన్ని పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. అదే సందర్భంలో 2011లో చిదంబరం ఫార్ములాను అనుసరిస్తే అదే గందరగోళం ఉంటుంది. కనుక కుల లెక్కలు తీసినట్టు ఉంటుంది. వాటిని తిరిగి కోర్టుల్లోగాని, మరేచోటగాని చెల్లనివిగా చేయవచ్చు. ఈ స్ట్రాటజీ వల్ల 2011లోని లెక్కలు ఎందుకూ పనికిరానివిగా పోయాయి.
ప్రాంతీయ పార్టీలు ఈ అంశంపై ఒక స్పష్టమైన వైఖరి కలిగిలేవు. ఎక్కువ రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉండడం వలన ఆయా రాష్ట్రాల్లోని బీసీలు బీజేపీని నిలదీసి ఎన్నికల్లో వ్యతిరేకులమైతామనే పరిస్థితి లేదు. బీజేపీలో బతికే ఓబీసీలు ఎప్పుడూ రిజర్వేషన్ల కోసం కొట్లాడింది లేదు.
బీసీల్లో రాజకీయ చైతన్యరాహిత్యం
ఓబీసీల్లో రాజకీయ చైతన్యం అగ్రకులాల్లో బలంగా ఎదిగి లేదు. చాలా గ్రామాల్లో కూలీలకు, కుటీర పరిశ్రమలవారికి అసలు ఓబీసీలమని తెలియదు. పిల్లలు స్కూలుకో, కాలేజీకో వెళ్లినప్పడు బీసీ సర్టిఫికెట్ తీసుకున్నప్పుడు తప్ప వారికి శూద్ర కులాల్లో వ్యత్యాసంగాని ఓబీసీ అనే రాజకీయ చైతన్యంగాని కనిపించదు. అగ్ర కులాలు సంఖ్యరీత్యా తక్కువగా, బాగా చదువుకున్నవారు అయినందువల్ల జాతీయ లేదా రాష్ట్ర రాజకీయ, ఆర్థిక వ్యవస్థల్లో తమ స్థానం కోసం ఐక్యంగా కృషి చేస్తారు.
ఓబీసీ పరిస్థితి అదికాదు. రిజర్వేషన్ అనే రాజ్య ప్రత్యేక ట్రీట్‌మెంట్ వారికి చాలా దూరంగా ఉన్న ఆర్థిక అంశం. నిత్యం కూలి, నాలి, హమాలి, మేస్త్రీ పని చేసుకునేవారు తమ పిల్లలను కూడా ఆ పనులలోనే ఇరికించే ప్రయత్నంలో ఉంటారు. అందువల్ల సెన్సస్ ఎన్యూమరేటర్లు కులం అడిగితే చెబుతారుగాని, అది వారికి తెలిసిన పదకోశంలో, పరిపాలన భాషలో తమ కులంపేరు కూడా వారు చెప్పలేరు.
తెలంగాణ సర్వేలో జరిగిందేమిటి?
రాష్ట్ర బీసీ కమిషన్, ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్‌లు సంవత్సరాల తరబడి రూపొందించిన బీసీ కులాల మాన్యువల్‌లో చేర్చి ఎన్యూమరేటర్‌కి ఇచ్చారు. కనుక మీ కులంపేరు ఈ లిస్టులో ఉన్నదే కదా అంటే అవుననో, కాదనో చెప్పారు. వాళ్లు ఇతర లిస్టులో పేరు అడిగి అవునన్నప్పుడు దాని కోడ్ ఎదురుగా ఆ వ్యక్తిని నమోదు చేశారు. ఇదే పద్ధతిన జాతీయ స్థాయిలో చేస్తేనే బీసీల లెక్క సరిగ్గా తేలుతుంది. లేని ఎడల తేలదు. దీనికి కేంద్రం అన్ని రాష్ట్రాలలో బీసీల లిస్టుల ప్రకారం కుల సర్వే చేయించాలి.
అట్లా జరగనప్పుడు లక్షలాది కులాల పేర్లు ప్రాపర్ నేషనల్ సెన్సెస్‌లో కూడా నమోదు అవుతాయి. ఈ లెక్క 1931 జనాభా లెక్కల్లో వచ్చిన మొత్తం కులాల సంఖ్యకు, ఇప్పుడు సెన్సెస్‌లో తేలిన కులాల సంఖ్యకు చాలా పెద్ద తేడా ఉంటుంది. ఆ కులాల్లో ఏది ఓబీసీ కులం, ఏది జనరల్ కులం అని వేరుచేయడం అసాధ్యం. ఇదీ అసలు సమస్య. ఇది బీజేపీ నాయకత్వానికి తెలుసు.
ముస్లిం ఓబీసీ సమస్య
కేంద్రంలోగాని, రాష్ట్రాల్లోగాని ముస్లింలలో కులం ఉన్నదని బీజేపీ అంగీకరించడం లేదు.
జాతీయ స్థాయిలో తెలంగాణ, బిహార్‌లో జరిగినట్టు ముస్లింలను ఓబీసీలో కలిపే సమస్య లేదు. విచిత్రమేమంటే వాళ్లు చాలా వెనుకబడి ఉన్నప్పటికీ తమను ఓబీసీలుగా చూడాలనే డిమాండ్, మొబిలైజేషన్ వాళ్లలో అసలే లేదు. వాళ్లలో స్త్రీ– పురుషులు బయటికొచ్చి అడిగే పరిస్థితి లేదు.
తెలంగాణ కుల సర్వే ప్రకారం చాలామంది ముస్లింలు వెనుకబడి ఉన్నారు. కానీ మమ్మల్ని ఓబీసీలుగా గుర్తించాలనే డిమాండ్ ఎక్కడా కనిపించదు. ఇది బీజేపీకి అనుకూలమైంది. కొద్దిమంది రాజకీయ నాయకులు కావాలని అడగొచ్చు. నిజానికి 2014లో ఆనాటి టీఆర్‌ఎస్ ప్రభుత్వం ముస్లింలదరినీ ఒక రిలీజియస్ గ్రూపుగానే సర్వే చూసింది. 2024–25 కేస్ట్ సర్వేలో కాంగ్రెస్ రిజర్వేషన్ లిస్ట్ ప్రకారం ముస్లింల్లో 10.08 శాతం ఓబీసీలు. కేవలం 2.48 శాతం మాత్రమే జనరల్ కేస్ట్ ముస్లింలుగా నమోదు చేసుకున్నారు.
మొత్తం 12.56 శాతం ముస్లింలలో 10.08 శాతం అంటే 90 శాతం పాపులేషన్ ఓబీసీలుగానే నమోదు చేసుకున్నారు. రేపు జరిగే జాతీయ సెన్సెస్‌లో ముస్లింలలో కేవలం మతపరంగా మాత్రమే గుర్తించబడతారు. ముస్లిం నాయకత్వం, యువత కూడా మతపర అంశానికే ప్రాధాన్యత ఇస్తారు. కానీ, విద్య, ఆర్థిక అభివృద్ధి, రిజర్వేషన్ విషయం అంతగా పట్టించుకోరు అని బీజేపీ అర్థం చేసుకున్నట్లు కనబడుతున్నది.
- ప్రొ. కంచ ఐలయ్య షఫర్డ్
గమనిక: ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ [email protected] రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.రచన 700 పదాలకు మించరాదు.
