- మంచిర్యాల కమిషనర్, సిబ్బందిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి
- మంచిర్యాలలో కాంగ్రెస్ అనుబంధ ఎస్సీ సెల్ నిరసన
- కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ కార్పొరేటర్లు, లీడర్లు
కోల్‌బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా కేంద్రంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, కటౌట్లను తొలగించిన ఘటనపై శనివారం దళిత సంఘాలు, కాంగ్రెస్ కార్పొరేటర్లు, లీడర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అనుబంధ ఎస్సీ సెల్ చైర్మన్ పైడిమల్ల నర్సింగ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ లీడర్లు, దళితులు, అభిమానులు మంచిర్యాల ఐబీ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం ముందు ప్లకార్డులతో నిరసన తెలిపారు. నర్సింగ్ మాట్లాడుతూ.. ఎంపీ గడ్డం వంశీకృష్ణ మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో ఎంపీల్యాడ్ నిధులు కేటాయించి అభివృద్ధి పనుల శంకుస్థాపన కోసం శుక్రవారం పర్యటించగా కాంగ్రెస్ కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, లీడర్లు ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేశారన్నారు.
కానీ వాటిని రాత్రికి రాత్రే కార్పొరేషన్ కమిషనర్ అవినాశ్ నేతృత్వంలో సిబ్బంది తొలగించారని ఆరోపించారు. దళితుడైన ఎంపీ వంశీకృష్ణను అవమానించేలా వ్యవహరించిన కమిషనర్, సిబ్బందిపై చర్యలు తీసుకొని ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. ఎస్సీ సెల్ లీడర్లు గజెల్లి లక్ష్మణ్, పొట్ట మధుకర్, నర్సింగ్, దమ్మ నారాయణ, ఎ.రవి, దమ్మ సునీల్, కమాలకర్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్‌కు ఫిర్యాదు
మున్సిపల్ కమిషనర్ అవినాశ్, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, లీడర్లు కలెక్టర్ కుమార్ దీపక్‌కు ఫిర్యాదు చేశారు. దళిత ఎంపీ వంశీకృష్ణ ఫ్లెక్సీలను ఉద్దేశ్యపూర్వకంగా తొలగించారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో నస్పూర్ మున్సిపల్మాజీ చైర్పర్సన్ సురమిల్ల వేణు, కార్పొరేటర్లు ఇరుదిండ్ల రవి, మేకల రాము, వెంకటకృష్ణ, మాజీ కౌన్సిలర్లు అగల్ డ్యూటీ రాజు, సంజీవ్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ మాజీ ప్రెసిడెంట్ అశోక్‌తేజ, సతీశ్వర్ రెడ్డి తదితరులు ఉన్నారు.
ఎంక్వయిరీకి కలెక్టర్ ఆదేశం
ఎంపీ గడ్డం వంశీకృష్ణ పర్యటనకు సంబంధించిన ఫ్లెక్సీలు, కటౌట్ల తొలగింపు ఘటనపై ఎంక్వయిరీకి శనివారం సాయంత్రం కలెక్టర్ కుమార్ దీపక్ఆదేశాలు జారీ చేశారు. ఫ్లెక్సీలు తొలగించిందెవరు? ఎవరు తొలగించమన్నారు? తదితర అంశాలపై వెంటనే ఎంక్వయిరీ చేసి నివేదిక ఇవ్వాలని మున్సిపల్కమిషనర్ అవినాశ్‌ను ఆదేశించారు. ఈ ఘటనపై కలెక్టర్తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసినట్లు సమాచారం.
