అనీష్, అనస్వర రాజన్ జంటగా దర్శకుడు వెంకీ కుడుముల నిర్మిస్తున్న చిత్రం ‘ఇట్లు అర్జున’. మహేష్ ఉప్పల దర్శకుడు. అక్టోబర్ 30న సినిమా విడుదల కానుండగా శనివారం టీజర్ విడుదల చేశారు. మాటలు రాని హీరో తన ప్రేమను ఎలా వ్యక్తపరిచాడనేది కథగా టీజర్ ద్వారా రివీల్ చేశారు. ‘ఈ నగరానికి కొత్త పోరడొచ్చినాడే..’ అని తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోరు హైలైట్‌గా నిలిచింది.
ఈ సందర్భంగా నిర్వహించిన టీజర్ లాంచ్ ఈవెంట్‌లో అనీష్ మాట్లాడుతూ ‘ఇందులో చాలెంజింగ్ క్యారెక్టర్ చేశా. నేను పోషించిన అర్జున్ పాత్ర అందరికీ గుర్తుండిపోతుంది. యాక్షన్ చాలా కొత్తగా ఉంటుంది. ఈ పాత్రకు నన్ను నమ్మిన వెంకీ అన్నకు థ్యాంక్స్’ అని చెప్పాడు. ఈ చిత్రం తనకు చాలా స్పెషల్ అని అనస్వర రాజన్ చెప్పింది. దర్శకుడు మహేష్ ఉప్పల మాట్లాడుతూ ‘ఇదొక వైవిధ్యమైన ప్రేమకథ. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో రూపొందిస్తున్నాం’ అని చెప్పాడు. నిర్మాత వెంకీ కుడుముల మాట్లాడుతూ ‘గతంలో డైరెక్టర్‌గా సీన్ గురించి మాత్రమే ఆలోచించే నేను, ఇప్పుడు నిర్మాతగా బడ్జెట్ గురించి కూడా ఆలోచిస్తున్నా. మిగతా క్రాఫ్ట్స్ పై అవగాహన పెరుగుతుందని నమ్ముతున్నా. ఇందులో అనీష్ పెర్ఫార్మెన్స్ అందరికీ నచ్చుతుంది. తనని పరిచయం చేస్తున్నందుకు ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నా’ అని అన్నారు.
