ధన్వాడ, వెలుగు: నారాయణపేట జిల్లా ధన్వాడలోని ఆదర్శ పాఠశాల వసతి గృహానికి చెందిన 31 మంది ఇంటర్ స్టూడెంట్లు ఫుడ్ పాయిజన్తో అస్వస్థతకు గురయ్యారు. హాస్టల్లో మొత్తం 103 మంది విద్యార్థినులు ఉండగా, శనివారం 88 మంది హాజరయ్యారు. వీరంతా ఉదయం టిఫిన్‌లో భాగంగా బోండా, పల్లి చట్నీ తిని క్లాస్‌లకు వెళ్లారు. అక్కడ కడుపులో ఇబ్బందిగా ఉండడంతో ఆరుగురు హాస్టల్‌కు వచ్చి నిద్రపోయారు.
లంచ్ సమయంలో హాస్టల్‌కు వచ్చిన స్టూడెంట్లలో పలువురు ఇబ్బంది పడగా, మరికొందరు లంచ్ చేయలేకపోయారు. అప్రమత్తమైన ప్రిన్సిపాల్, లెక్చరర్లు 31 మంది విద్యార్థినులను పీహెచ్ సీకి తరలించారు. డాక్టర్ అనూష సూచన మేరకు 13 మందిని మెరుగైన చికిత్స కోసం108లో నారాయణపేట జిల్లా ఆసుపత్రికి తరలించారు.
మిగిలిన 18 మంది విద్యార్థినులకు స్థానికంగా చికిత్స అందజేశారు. విషయం తెలుసుకున్న ఆర్డీవో రమేశ్, తహసీల్దార్ సింధూజ హాస్టల్‌ను సందర్శించి వివరాలు సేకరించారు. ఫుడ్ సేఫ్టీ అధికారి మౌనిక హాస్టల్‌కు చేరుకొని నిల్వ ఉన్న అల్లం పేస్ట్, పప్పులు పారవేయించారు.
