రసాయన ఎరువుల వినియోగం తగ్గించాలి : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

రసాయన ఎరువుల వినియోగం తగ్గించాలి : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
  • నకిలీ ఎరువులు, పురుగుమందులపై కఠినంగా వ్యవహరించాలి
  • అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశం

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలో ఎరువుల వినియోగంలో నెలకొన్న అసమతుల్యతను తక్షణమే సరిదిద్దాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ సదస్సులో ప్రస్తావించిన అంశాలపై శనివారం సెక్రటెరియట్​లో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్​పీకే వినియోగ నిష్పత్తి 14.9:5.7:1గా ఉందని, అసలైన ఆదర్శ నిష్పత్తి 4:2:1 మాత్రమేనని పేర్కొన్నారు.  హెక్టారుకు యూరియా వినియోగం 217 కిలోలు ఉండగా, జాతీయ సగటు 160 కిలోలుగా ఉందన్నారు.

రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి ఫెర్టిగేషన్‌‌ వినియోగాన్ని పెంచాలని సూచించారు. నకిలీ, నాసిరకం ఎరువులు, పురుగుమందులపై నమోదయ్యే ప్రతి కేసులోనూ కఠినంగా ఫాలోఅప్‌‌ చర్యలు తీసుకోవాలన్నారు. నమూనాల సేకరణ నుంచి కోర్టు కేసు వరకు మొత్తం ప్రక్రియను డిజిటల్‌‌గా ట్రాక్‌‌ చేసే వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు. ప్రయోగశాలలకు వేగంగా ఎన్​ఏబీఎల్​ గుర్తింపు తీసుకురావడంతో పాటు పరీక్షల సామర్థ్యాన్ని పెంచాలని ఆదేశించారు. రాబోయే యాసంగికి అవసరమైన విత్తనాలను ముందుగానే సిద్ధం చేయాలని ఆదేశించారు.

అగ్రికల్చర్​ ఇన్​ఫ్రాస్ట్రక్షర్​ నిధిని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు. కూరగాయల కోసం కూల్‌‌చెయిన్లు, ఎస్​హెచ్​జీలు, ఎఫ్​పీఓల ఆధ్వర్యంలో పప్పు, నూనె మిల్లుల ఏర్పాటును ప్రోత్సహించాలన్నారు. రైతు నేస్తం సేవలను వ్యవసాయ శాఖకే పరిమితం చేయకుండా ఉద్యాన, పశుసంవర్ధక, మత్స్య, సహకార శాఖలు విస్తృతంగా వినియోగించుకునేలా సమన్వయం చేయాలని ఆదేశించారు. ప్రకృతి వ్యవసాయాన్ని మార్కెట్‌‌తో అనుసంధానించి క్లస్టర్‌‌–సర్టిఫికేషన్‌‌–ఎఫ్​పీఓ–ప్రాసెసింగ్‌‌–బ్రాండింగ్‌‌–మార్కెట్‌‌ విధానంలో ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర వ్యవసాయ పథకాలపై రైతులకు మరింత అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.