మారుతున్న జీవనశైలి..టేబుల్ ఫర్ వన్..రెస్టారెంట్లలో మార్పులు

మారుతున్న జీవనశైలి..టేబుల్ ఫర్ వన్..రెస్టారెంట్లలో మార్పులు

ఒకప్పుడు రెస్టారెంట్‌‌కు ఒంటరిగా వెళ్తే.. ‘ఎవరూ తోడు రాలేదా?’ అనే చూపులు! ఇప్పుడు మాత్రం.. ‘టేబుల్ ఫర్ వన్ ప్లీజ్!’ అంటున్నారు. నగర జీవనశైలి మారుతోంది. దాంతో భోజనం చేసే పద్ధతీ మారుతోంది. కుటుంబం, స్నేహితులు, సహోద్యోగులు ఎవరూ లేకపోయినా.. నచ్చిన రెస్టారెంట్‌‌కు వెళ్లి నచ్చిన ఫుడ్‌‌ను ప్రశాంతంగా ఆస్వాదించేందుకు చాలామంది వెనుకాడటం లేదు. దీంతో భారతీయ రెస్టారెంట్లలోనూ ‘సోలో డైనింగ్’పై ఆసక్తి కనిపిస్తోంది.

ఉద్యోగం కోసం మరో నగరానికి వచ్చిన యువత, ఒంటరిగా ప్రయాణించేవారు, బిజీ షెడ్యూల్‌‌లో పనిచేసే ఉద్యోగులు, హాస్టళ్లలో లేదా అద్దె గదుల్లో ఉండే వారు.. ఇలా ఎన్నో వర్గాలకు ఒంటరిగా భోజనం చేయడం కొత్తేమీ కాదు. అయితే ఇప్పుడు దీనికి మరో కోణం చేరింది. అవసరం కోసం మాత్రమే కాకుండా.. ‘నా సమయం.. నా ఇష్టం’ అనే భావనతో కూడా చాలామంది సింగిల్ డైనింగ్‌‌ను ఎంచుకుంటున్నారు. 

స్నేహితుల కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేదు. అందరి అభిరుచులకు తగ్గట్టు ఆర్డర్ చేయాల్సిన పని లేదు. ఎప్పుడు వెళ్లాలి? ఏం తినాలి? ఎంతసేపు కూర్చోవాలి? అన్నది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయమే. అందుకే కొందరికి సోలో డైనింగ్ ఒక రకమైన స్వేచ్ఛగా మారుతోంది.

రెస్టారెంట్లలోనూ మార్పులు

కస్టమర్ల అభిరుచుల్లో వస్తున్న ఈ మార్పు రెస్టారెంట్ల డిజైన్‌‌పైనా ప్రభావం చూపుతోంది. గతంలో పెద్ద కుటుంబాలు, స్నేహితుల బృందాల కోసం నాలుగు, ఆరు, ఎనిమిది మంది కూర్చునే టేబుళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఉండేది. ఇప్పుడు కొన్ని రెస్టారెంట్లలో చిన్న టేబుళ్లు, కౌంటర్ సీటింగ్, విండో సీట్లు వంటి ఏర్పాట్లు కనిపిస్తున్నాయి. 

ఒంటరిగా వచ్చిన కస్టమర్‌‌కు పెద్ద టేబుల్ కేటాయించకుండా చిన్న స్థలంలో సౌకర్యవంతంగా కూర్చునే అవకాశం కల్పించడం వల్ల రెస్టారెంట్‌‌కు కూడా స్థల వినియోగం మెరుగవుతుంది. అదే సమయంలో కస్టమర్‌‌కు ఇబ్బంది లేకుండా భోజనం చేసే అవకాశం లభిస్తుంది.

ఫుడ్‌‌తో పాటు ‘మీ టైమ్’ కూడా!

సోలో డైనింగ్‌‌లో మరో ఆసక్తికరమైన అంశం.. భోజనం చేస్తూ తమకు నచ్చిన పనులు చేసుకోవడం. కొందరు ఫోన్‌‌లో వీడియోలు చూస్తుంటే.. మరికొందరు పుస్తకం చదువుతారు. ఇంకొందరు ల్యాప్‌‌టాప్‌‌లో పని పూర్తిచేసుకుంటారు. 

మరికొందరు మాత్రం ఏమీ చేయకుండా ప్రశాంతంగా భోజనం ఆస్వాదించడానికే ప్రాధాన్యం ఇస్తారు. ఇది ముఖ్యంగా నగరాల్లో వేగంగా మారుతున్న జీవనశైలికి అద్దం పడుతోంది. రోజంతా ఇతరులతో కలిసి పనిచేసేవారికి.. కాసేపు తమకంటూ ప్రత్యేక సమయం కావాలనిపించడం సహజమే. ఆ సమయాన్ని రెస్టారెంట్‌‌లో ఒక కప్పు కాఫీ, ఒక ప్లేట్ భోజనంతో గడపడం కూడా వారికి ఒక చిన్న విరామంగా మారుతోంది.

అయితే ఇంకా కొన్ని ఇబ్బందులు!

భారతీయ సమాజంలో భోజనం అంటే సాధారణంగా కుటుంబం లేదా స్నేహితులతో కలిసి చేసే కార్యక్రమంగానే భావిస్తారు. అందుకే కొన్ని సందర్భాల్లో ఒంటరిగా వచ్చిన కస్టమర్‌‌కు అసౌకర్యంగా అనిపించొచ్చు. పెద్ద టేబుల్ ఖాళీగా ఉన్నా చిన్న టేబుల్ కోసం వేచి చూడాల్సి రావొచ్చు. రద్దీ సమయాల్లో ఒకరి కోసం టేబుల్ కేటాయించడంపై రెస్టారెంట్లకు కూడా వ్యాపారపరమైన ఆలోచనలు ఉంటాయి. 

అయితే కొత్త తరం కస్టమర్ల అభిరుచులు మారుతున్న కొద్దీ ఈ పరిస్థితి కూడా క్రమంగా మారే అవకాశం ఉంది. భవిష్యత్తులో రెస్టారెంట్లు కుటుంబాలు, జంటలు, స్నేహితుల బృందాలతో పాటు సింగిల్ డైనర్లను కూడా ప్రత్యేక కస్టమర్ వర్గంగా పరిగణించే అవకాశముంది.

గమనిక:మీరూ లైఫ్​కి పిల్లల కథలు పంపాలి అనుకుంటున్నారా? అయితే.. కథను హామీ పత్రంతో పాటు [email protected] కి మెయిల్​ చేయండి.