హైదరాబాద్ లో హిట్ అండ్ రన్.. మూడేళ్ల బాలుడిని  ఢీకొట్టి ఆగకుండా వెళ్లిన కారు

హైదరాబాద్ లో హిట్ అండ్ రన్.. మూడేళ్ల బాలుడిని  ఢీకొట్టి ఆగకుండా వెళ్లిన కారు

హైదరాబాద్‌: ఐఎస్‌ సదన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో విషాదకరమైన హిట్‌ అండ్‌ రన్‌ ఘటన చోటుచేసుకుంది. రోడ్డు దాటుతున్న మూడేళ్ల చిన్నారిని ఓ XUV కారు ఢీకొట్టడంతో బాలుడు ఇజాన్‌ ఉద్దీన్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహమ్మద్‌ ఇజాన్‌ తన తల్లిదండ్రులతో కలిసి ఐఎస్‌ సదన్‌ ఎక్స్‌ రోడ్‌ సమీపంలోని ఫ్యూజన్‌ సిక్స్‌ వద్ద చాట్‌ తినేందుకు వచ్చాడు. ఈ క్రమంలో రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన XUV కారు చిన్నారిని ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాలుడు ఘటనాస్థలంలోనే మృతి చెందినట్లు తెలుస్తోంది.చిన్నారిని ఢీకొన్న అనంతరం కారు ఆగకుండా అక్కడి నుంచి వెళ్లిపోయింది. ప్రమాద దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో నమోదయ్యాయి. ఫుటేజీని పరిశీలించిన పోలీసులు ప్రమాదానికి కారణమైన వాహనం AP11AN6899 నంబర్‌ గల XUV కారుగా గుర్తించినట్లు తెలిపారు.

ఘటనపై ఐఎస్‌ సదన్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ప్రమాదానికి కారణమైన వ్యక్తిని గుర్తించి పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వాహనం కదలికలకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు.మరోవైపు, ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని యాకత్‌పురా ఎమ్మెల్యే జాఫర్‌ హుస్సేన్‌ సందర్శించారు. ఘటనకు సంబంధించిన వివరాలను స్థానికులు, పోలీసులను అడిగి తెలుసుకున్నారు.ఈ ఘటనతో చిన్నారి కుటుంబంలో విషాదం నెలకొంది. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించి బాధ్యుడిపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.