ఆకాశాన్ని తాకే రాజసౌధం.. ఫలక్‌నుమా!

ఆకాశాన్ని తాకే రాజసౌధం.. ఫలక్‌నుమా!

భారతదేశంలోని ఏడు అతిపెద్ద రాజభవనాల జాబితాలోకి హైదరాబాద్ ఫలక్ నుమా ప్యాలెస్ చేరింది. రాజపుత్- మొఘల్ శైలుల కలయిక, ఇటాలియన్ పాలరాతి మెట్లు, విశాలమైన తోటలతో కూడిన ఏడు రాజభవనాలు నాటి రాజుల కళావైభవం, నిర్మాణ నైపుణ్యానికి సాక్ష్యంగా నిలిచాయి. గుజరాత్ రాష్ట్రంలోని లక్ష్మీ విలాస్ ప్యాలెస్, బెంగళూరు ప్యాలెస్, ఉదయ్‌పూర్‌లోని సిటీ ప్యాలెస్, రాంబాగ్‌ ప్యాలెస్, ఫలక్‌నుమా ప్యాలెస్, మైసూరు ప్యాలెస్, ఉమైద్ భవన్ ప్యాలెస్​లు భారతీయ, యూరోపియన్ వాస్తుశైలిలో రాజసం ఉట్టిపడేలా నిర్మించారు.

హైదరాబాద్‌ చరిత్రను తలుచుకుంటే చార్మినార్‌.. గోల్కొండ.. చౌమహల్లా ప్యాలెస్‌తో పాటు గుర్తుకొచ్చే మరో అద్భుత రాజసౌధం ఫలక్‌నుమా ప్యాలెస్‌. కొండపై నుంచి నగరాన్ని వీక్షిస్తూ.. నిజాం కాలం నాటి రాజసం, కళా వైభవం, నిర్మాణ నైపుణ్యానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తున్న ఈ భవనం ఇప్పుడు ప్రపంచస్థాయి హెరిటేజ్‌ హాస్పిటాలిటీకి చిరునామాగా మారింది. భారతదేశ వైస్రాయ్‌లలో ఒకరైన నవాబ్ వికార్-ఉల్-ఉమ్రా నిర్మించిన ఈ కట్టడం ఆకారంలో తేలును పోలి ఉంటుంది.

ఇందులో ఇటాలియన్ పాలరాతి మెట్లు, వెనీషియన్ షాండిలియర్లు, విశాలమైన గ్రంథాలయం ఉన్నాయి. ఇవి నిజాం కాలం నాటి వైభవాన్ని ప్రతిబింబిస్తున్నాయి. హైదరాబాద్‌ నిజాం వ్యక్తిగత నివాసంగా ఉన్న ఈ భవనం ఇప్పుడు రాజసంపదకు ప్రతీకగా నిలుస్తోంది. సముద్ర మట్టానికి 609 మీటర్ల ఎత్తులో కొండపై 32 ఎకరాల ఉద్యానవనాల మధ్య ఉంది. దీనిలో మొత్తం 60 గదులు, సూట్లు ఉన్నాయి. ఇటాలియన్ శైలిలో హైదరాబాద్‌ రాజవైభవాన్ని ప్రతిబింబించేలా దీన్ని నిర్మించారు.

అధికారిక విందులకు నిలయం

ఫలక్​నుమా ప్యాలెస్​లో విదేశీ అధినేతలు, అంతర్జాతీయ ప్రతినిధులకు అధికారిక విందులు ఇవ్వడం ఇక్కడి ప్రత్యేకత. గతంలో గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్ 2017 సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సలహాదారు ఇవాంకా ట్రంప్‌నకు ప్రధాని మోదీ ఇక్కడ ఘనంగా విందు ఇచ్చారు. అలాగే బ్రిక్స్ సదస్సుల సందర్భంలోనూ విదేశీ మంత్రులు, ప్రతినిధులు ఇక్కడ విందుల్లో పాల్గొన్నారు. తాజాగా ఫలక్‌నుమా ప్యాలెస్‌లో సీఎం రేవంత్‌రెడ్డి ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్-4తో సమావేశమయ్యారు.

కాలం మారింది.. రాజ్యాలు కనుమరుగయ్యాయి.. నిజాం పాలన చరిత్రగా మిగిలిపోయింది. కానీ.. ఫలక్‌నుమా వైభవం మాత్రం చెక్కుచెదరలేదు. అందుకే ఫలక్‌నుమా కేవలం ఓ ప్యాలెస్‌ కాదు.. గత వైభవాన్ని వర్తమానానికి పరిచయం చేస్తున్న ఓ సజీవ చరిత్ర. ఆకాశం వైపు చూసే ప్రతి చూపుకూ.. హైదరాబాద్‌ రాజసాన్ని చాటే ఈ ‘ఫలక్‌నుమా’.. ఎప్పటికీ నగర వారసత్వానికి ఓ మకుటాయమానంగానే నిలిచిపోతుంది.

101 మంది కూర్చునే డైనింగ్ టేబుల్

ప్రపంచ ప్రసిద్ధ, ఏకకాలంలో 101 మంది కూర్చునేందుకు వీలుగా రాజసం ఉట్టిపడే డైనింగ్ టేబుల్ ఇక్కడ ఉంది. ఈ ప్యాలెస్‌లో జరిగే విందుల్లో అచ్చమైన హైదరాబాదీ వంటకాలు, నిజాం కాలం నాటి రాజసం ఉట్టిపడేలా ప్రత్యేక మెనూను అందిస్తారు. అత్యంత ప్రసిద్ధ వారసత్వ కట్టడాల్లో ఒకటైన ఫలక్ నుమా ప్యాలెస్ తాజ్‌ ఆధ్వర్యంలో లగ్జరీ హెరిటేజ్‌ హోటల్‌గా కొనసాగుతోంది. గుర్రపు బగ్గీలో వచ్చే అతిథులకు గులాబీ రేకులు, ప్రత్యక్ష ఖవ్వాలీ సంగీతంతో సాంప్రదాయ స్వాగతం లభిస్తుంది. ఇది వారికి నిజమైన రాజరిక అనుభూతిని అందిస్తుంది. పచ్చని తోటల మధ్య అవుట్‌డోర్ స్విమ్మింగ్ పూల్, ప్రత్యక్ష ఖవ్వాలీ ప్రదర్శనలు, కథక్ నృత్య ప్రదర్శనలను ఆస్వాదించొచ్చు.