- విద్యా కమిషన్ మాజీ చైర్మన్ ఆకునూరి మురళి
నిజామాబాద్, వెలుగు: విద్యారంగం మార్పునకు పటిష్టమైన చట్టాల రూపకల్పన అవసరమని రాష్ట్ర విద్యా కమిషన్ మాజీ చైర్మన్ ఆకునూరి మురళి తెలిపారు. చట్టాలు చేసి చేతులు దులుపుకోకుండా సీఎం స్థాయి నుంచి కింది స్థాయి వరకు రివ్యూ చేయాలన్నారు. శనివారం ఐదో రోజు బస్ యాత్రలో భాగంగా నిజామాబాద్ నగరంలోని గర్ల్స్ హైస్కూల్‌ను విజిట్ చేసి స్టూడెంట్లతో ఇంటరాక్ట్ అయ్యారు. అనంతరం పెన్షనర్స్ యూనియన్ బిల్డింగ్‌లో రౌండ్ టేబుల్ మీటింగ్ నిర్వహించి మాట్లాడారు.
విద్యా కమిషన్ చైర్మన్‌గా ఎడ్యుకేషన్ సిస్టం బలోపేతం కోసం తాను 52 అంశాలతో రిపోర్ట్ ఇవ్వగా అమలు కావడం లేదన్నారు. తన రిపోర్ట్ ప్రభుత్వానికి నచ్చలేదా? లేదంటే ఇతర కారణాలేమన్న ఉన్నాయా? తెలియదని చెప్పారు. సర్కార్‌తో పాటు ప్రైవేట్ స్కూళ్లలో తాను ప్రతిపాదించిన 52 రకాల స్టాండర్డ్స్ అమలు చేయాలని కోరారు. విద్యారంగానికి ఏటా 18 శాతం బడ్జెట్ కేటాయింపుల చట్టం చేయాలన్నారు. రూ.3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో విద్యారంగానికి కేటాయించేందుకు రూ.6 వేల కోట్ల నిధులు లేవా? అని ప్రశ్నించారు.
బీఆర్‌ఎస్ హయాంలో భూకబ్జాలు జరిగాయని, ఎన్నికల్లో లబ్ధి కోసం ప్రాజెక్టుల పేరుతో డబ్బు వృథా చేశారని దుయ్యబట్టారు. జిల్లా స్థాయిలో కూడా ఫీజు నియంత్రణ కమిటీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చంపాలాల్, రిటైర్డ్ పెన్షనర్ల యూనియన్ ప్రతినిధులు రామ్మోహన్‌రావు, నగేశ్, శ్రీధర్, టీపీఎఫ్ నేతలు ప్రొఫెసర్ పద్మజాషా, డాక్టర్ పాలకుర్తి జగదీశ్వర్, సృజన్ యాదవ్, డాక్టర్ సూరి, వాసు, ప్రసాద్‌రావు, రుబీనా పాల్గొన్నారు.
