తెలంగాణలో వరి టెన్షన్.. 55 లక్షల ఎకరాల్లో సాగు, నీటి కోసం రైతుల తిప్పలు

తెలంగాణలో వరి టెన్షన్.. 55 లక్షల ఎకరాల్లో సాగు, నీటి కోసం రైతుల తిప్పలు
  • రాష్ట్రంలో 55 లక్షల ఎకరాల్లో సాగు
  • రికాం లేకుండా నడుస్తున్న 25 లక్షల కరెంట్ మోటర్లు
  • రోజూ 6 వేల నుంచి 7 వేల మెగావాట్ల విద్యుత్ వినియోగం
  • ఎల్​నినోతో కరుణించని వరుణుడు 
  • 20% లోటు వర్షపాతం నమోదుతో పరేషాన్​ 
  • రోజు రోజుకూ పాతాళానికి పడిపోతున్న భూగర్భ జలాలు
  • పలు చోట్ల పంటను పశువుల మేతకు వదిలేస్తున్న రైతులు
  • అన్నదాతల నుంచి అధికారుల వరకూ అందరికీ టెన్షన్

 

హైదరాబాద్/మహబూబ్‌‌‌‌నగర్, వెలుగు:  రాష్ట్రంలో అన్నదాతల నుంచి అధికారుల దాకా ‘వరి’ టెన్షన్ మొదలైంది. ఎల్​నినో కారణంగా ఈసారి వర్షాలు పడవని, వరి సాగుచేయవద్దని ప్రభుత్వం ప్రచారం చేసినప్పటికీ గతంలో కన్నా సాగు పెరిగింది. ఏకంగా 55 లక్షల ఎకరాలకు పైగా సాగవ్వడంతో ఇప్పుడు ఆ పంటను కాపాడుకోవడం కత్తి మీద సాములా మారింది. వర్షాలు లేకపోవడంతో ప్రాజెక్టులన్నీ వెలవెలబోతున్నాయి. అటు భూగర్భజలాలు అడుగంటాయి. దీంతో పంటను కాపాడుకునేందుకు రైతులు బోర్లు, బావులపైనే ఆధారపడ్తున్నారు. వరి పొట్ట దశకు రావడం, ఎండలు మండుతుండడంతో నీళ్ల అవసరం పెరిగింది. ఊట తగ్గిన బోర్ల నుంచి నీటిని తోడేందుకు రైతన్నలు రికాం లేకుండా కరెంట్ మోటార్లు నడిపిస్తున్నారు. దీంతో కరెంట్ వినియోగం చుక్కలను తాకుతోంది. వ్యవసాయానికి రికార్డు స్థాయిలో రోజూ 6  వేల నుంచి 7 వేల మెగావాట్ల విద్యుత్ వాడకం జరుగుతున్నది. ఇంత చేసినా పంటకు సరిపడా నీళ్లు అందక చాలా చోట్ల ఎండిపోతున్నాయి.


ఎల్ నినో కారణంగా ఈ వానాకాలం సరిపడా వర్షాలు లేక కరువు పరిస్థితులు నెలకొంటాయని, వరి పంట సాగుచేయవద్దని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సూచించింది. జులై​ నెలలో కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి జిల్లా కలెక్టర్లకు, వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. వరికి బదులు ఆరుతడి పంటలు సాగుచేయాలని కోరింది. రిజర్వాయర్లు నిండకపోతే సాగునీరు విడుదల చేయమని, తాగునీటి అవసరాలకే వాడుతామని స్పష్టంచేసింది. కానీ ప్రభుత్వ సూచనలు ఎక్కడ అమలుకాలేదు. పైగా ఈసారి పత్తిని మించి వరి పంట సాగు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కోటి 24 లక్షల 90 వేల ఎకరాల్లో పంటలు సాగు చేయగా ఇందులో 55.89 లక్షల ఎకరాల్లో అత్యధికంగా వరినాట్లు వేశారు. ఆ తర్వాత 48.32 లక్షల ఎకరాల్లో పత్తి , 5.93 లక్షల ఎకరాల్లో మక్క, 5.57 లక్షల ఎకరాల్లో కంది లాంటి పంటలు సాగుచేశారు. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 3.60 లక్షల ఎకరాలు, సూర్యాపేట జిల్లాలో 3.45 లక్షల ఎకరాలు, సిద్ధిపేట జిల్లాలో 3.16 లక్షల ఎకరాలు, జగిత్యాల జిల్లాలో 3 లక్షల ఎకరాల్లో వరి సాగైనట్లు ప్రభుత్వం ప్రకటించింది. 

రికాం లేకుండా 25 లక్షల మోటర్లు

రాష్ట్రవ్యాప్తంగా 29 లక్షలకు పైగా వ్యవసాయ కరెంట్ మోటార్లు ఉండగా నిత్యం 25 లక్షలకు మించి మోటార్లను రైతులు రికాం లేకుండా నడిపిస్తున్నట్లు విద్యుత్ శాఖ ఆఫీసర్లు ప్రకటించారు. దీంతో ఎన్నడూ లేని రీతిలో వానాకాలంలో వ్యవసాయ విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగింది. సాధారణ వర్షపాతం ఉన్న సంవత్సరాల్లో రాష్ట్రంలో రోజుకు సుమారు11 వేల మెగావాట్లలోపే పీక్ డిమాండ్ ఉండేది. ఇప్పుడదీ ఏకంగా రోజుకు 19 వేల 500 మెగావాట్లు దాటిపోయింది. వర్షాలు బాగుంటే రిజర్వాయర్లు, చెరువులు నిండి భూగర్భజలాలు పెరగడంతో బోర్‌‌ వెల్ పంపింగ్ తగ్గి విద్యుత్ డిమాండ్ తగ్గేది. దీంతో వ్యవసాయ డిమాండ్ రోజుకు 3 వేల నుంచి 4 వేల మెగావాట్ల మధ్య ఉండేది. కానీ, ప్రస్తుతం వ్యవసాయ లోడ్ ఏకంగా రోజుకు 6 వేల నుంచి 7 వేలు దాటుతోందని సదరన్, నార్తర్న్, రైతు డిస్కమ్ ఆఫీసర్లు చెప్తున్నారు. 

పాతాళానికి భూగర్భజలాలు

ఎల్​నినో ప్రభావంతో రాష్ట్రంలో సరిగ్గా వానలు పడక భూగర్భ జలాలు పాతాళానికి పడిపోతున్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే సగటున 2.09 మీటర్ల మేర క్షీణించాయి. రాష్ట్రంలోని 30 జిల్లాల్లో భూగర్భ జలాలు అడుగంటినట్లు భూగర్భ జలవనరుల శాఖ ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సగటు భూగర్భ జలమట్టం భూ ఉపరితలం నుంచి 7.87 మీటర్ల లోతులో ఉందని తెలిపింది. మేడ్చల్ మల్కాజిగిరిలో సగటున అత్యంత లోతుగా 12.12 మీటర్లకు నీటి మట్టం పడిపోయింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గత ఏడాదితో పోలిస్తే సగటున 5 మీటర్ల మేర నీటిమట్టాలు కిందికి దిగజారినట్లుగా సర్కారు ప్రకటించింది. ఎల్​నినో ప్రభావంతో ఈ వానాకాలంలో లోటు వర్షపాతం నమోదైంది. సెప్టెంబర్ 18 నాటికి సాధారణంగా 640 మి.మీ.కి బదులు 543 మి.మీ. మాత్రమే వానలు పడ్డాయి. దీంతో కొన్ని జిల్లాల్లో 15 నుంచి 20% లోటు ఉండగా మరికొన్ని జిల్లాల్లో 30 నుంచి 46% లోటు ఉన్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. దీనివల్ల కృష్ణా, గోదావరి బేసిన్ రిజర్వాయర్లు నిండలేదు. గతేడాది ఇదే టైమ్‌‌కు 500 టీఎంసీల నీళ్లు నిల్వ ఉంటే ఇప్పుడు కేవలం 241 టీఎంసీల నీళ్లు మాత్రమే నిల్వ ఉన్నాయి. 50 శాతం మేర నీటి మట్టాలు తగ్గిపోయాయి. 

ఎండుతున్న పంటలు.. 

అడపాదడపా వర్షాలు పడినా ప్రాజెక్టుల్లోకి నీళ్లు వస్తాయని, ఆయకట్టుకు నీళ్లు ఇస్తారనే ఆశతో ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ జిల్లాల్లోని ఎస్సారెస్పీ, సాగర్ ఆయకట్టు కింద.. పాలమూరు జిల్లాలోని వివిధ లిఫ్టులు, ఉమ్మడి వరంగల్​జిల్లాలోని దేవాదుల కింద లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగుచేశారు. వర్షాలు లేక ప్రాజెక్టుల్లోకి నీళ్లు రాకపోవడంతో ఒక్క దేవాదుల, కేఎల్ఐ కింద తప్ప మిగిలిన అన్ని ప్రాజెక్టులు, లిఫ్టుల కింద నీటిని విడుదల చేయలేదు. మరోవైపు భూగర్భజలాలు అడుగంటడంతో బోర్లు, బావులపై మోటర్లు అరగంట, గంటకు మించి పోయడం లేదు. వర్షాకాలంలోనూ 35 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో నీరు పారక చాలా చోట్ల పంటలు ఎండిపోతున్నాయి. దీంతో చాలా చోట్ల వరిపై ఆశలు వదిలేసుకుంటున్న రైతులు పశువులు, జీవాలకు మేత కోసం వదిలేస్తున్నారు.  

జూరాల ఆయకట్టు రైతులను ఆదుకోండి: ఉత్తమ్‌‌కు డీకే అరుణ విజ్ఞప్తి

జూరాల ప్రాజెక్టు పరిధిలోని గద్వాల, ఆత్మకూరు ప్రాంతాల్లో సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని, అన్నదాతలను తక్షణమే ఆదుకోవాలని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ కోరారు.  శనివారం రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేసి పరిస్థితులను వివరించారు. పంటలు వాడిపోతుండటంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. గద్వాల, ఆత్మకూరు ప్రాంతాల్లో రైతులు ఆందోళనతో రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారని ఎంపీ చెప్పారు. పంటలు కళ్లముందే ఎండిపోతుంటే రైతులు కన్నీరు మున్నీరవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తక్షణమే జూరాల నుంచి సాగునీటిని విడుదల చేయాలని మంత్రిని కోరారు. రాబోయే మూడు రోజుల్లోగా జూరాల ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయాలని ఎంపీ డీకే అరుణ విజ్ఞప్తి చేశారు. పంటలు పూర్తిగా ఎండిపోయిన తర్వాత అధికారులు నీటిని విడుదల చేసినా ఎలాంటి ప్రయోజనం ఉండదని గుర్తుచేశారు. కాగా, డీకే అరుణ చేసిన విజ్ఞప్తిపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ప్రాజెక్టు వద్ద ఉన్న నీటి నిల్వలు, క్షేత్రస్థాయి పరిస్థితులపై అధికారులతో సమీక్షించి, రైతులను ఆదుకునేందుకు తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

కండ్ల ముందే చేను ఎండుతోంది

నాకు రెండెకరాల భూమి ఉంది. బోరు సౌలత్ ఉండడంతో రెండెకరాల్లో వరి సాగు చేసిన. మొదట్లో బోరు నుంచి నీళ్లు బాగా వచ్చాయి. తీరా ఇప్పుడు ఎండలు కాస్తుండడంతో నీరు సన్నగా వస్తోంది. ఆ నీరు కూడా పంటకు సరిపోవడం లేదు. దీనికితోడు కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియడం లేదు. లక్ష వరకు పెట్టుబడి పెట్టి వరి వేస్తే, నీరు అందక కండ్ల ముందే ఎండిపోతోంది. బాధ భరించలేక గొర్లకు మేత కోసం వదిలేసిన.
‌‌‌‌- కర్నె బాల్‌‌రాజ్, రైతు, మాద్వార్ గ్రామం, మక్తల్ మండలం, నారాయణపేట జిల్లా 

దిక్కుతోచడం లేదు

నాకున్న నాలుగు ఎకరాల్లో వరి వేసిన. లక్షన్నర వరకు పెట్టుబడులు అయ్యాయి. తీరా చేను కంకి పట్టే దశలో ఎండలు కాస్తున్నాయి. వర్షాలు లేక నీరు కూడా అందడం లేదు. దీంతో చేను ఎండిపోయింది. పంట పెట్టుబడి కోసం లక్షన్నర వరకు అప్పులు చేశా. అప్పులు ఎలా తీర్చాలి?  కుటుంబాన్ని ఎలా పోషించాలో అర్థం కావడం లేదు. 

- కావలి శేఖరయ్య, రైతు, జంగంరెడ్డిపల్లి, నర్వ మండలం, నారాయణపేట జిల్లా