- సర్వే నంబర్ 325లో భూములున్న అందరికీ అందజేత
- జాగాకు సంబంధించిన ఆధారాలతో రావాలని సూచన
- ఎర్రవల్లిలో మూడోరోజు రెవెన్యూ అధికారుల సర్వే
- శివారు వెంకటాపూర్ రైతుల అభ్యంతరాలు
సిద్దిపేట/ములుగు, వెలుగు: సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 325లో భూములున్న వంద మంది రైతులకు రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 21న భూమికి సంబంధించిన ఆధారాలతో రావాలని సూచించారు. రైతుల వారీగా క్షేత్రస్థాయి సర్వే నిర్వహించేందుకు ఈ నోటీసులు జారీ చేశారు. ఎర్రవల్లిలో మాజీ సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్ పరిసరాల్లో రెవెన్యూ అధికారులు మూడో రోజూ సర్వే నిర్వహించారు. ఎర్రవల్లి గ్రామ పరిధిలోని 325 సర్వే నంబర్‌లో 388 ఎకరాల భూమి ఉండగా.. ఇందులో దాదాపు 160 మంది రైతులకు పట్టాలున్నాయి.
వీరిలో బీసీ, ఎస్సీలే అధికంగా ఉన్నారు. శనివారం గజ్వేల్ ఆర్డీవో చంద్రకళ, సర్వే ఏడీ సుదర్శన్‌ల నేతృత్వంలో ఐదు ప్రత్యేక టీమ్‌లు ఎర్రవల్లి సమీపంలోని భూములను క్షేత్రస్థాయిలో పరిశీలించాయి. 325 సర్వే నంబర్‌లోని 388 ఎకరాల భూ హద్దులపై సర్వే పూర్తి చేశారు. అనంతరం ఎర్రవల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో జీపీవో ఆధ్వర్యంలో 325 సర్వే నంబర్‌లో భూములున్న వంద మంది రైతులకు నోటీసులు అందజేశారు. రైతులు ఈ నెల 21న ఆధారాలతో వచ్చిన తర్వాత వారి భూముల హద్దులను కూడా పరిశీలించనున్నారు. ఎర్రవల్లి, శివారు వెంకటాపూర్ గ్రామాల్లోని భూములతో పాటు 325 సర్వే నంబర్‌లోని భూముల హద్దులను గత రెండు రోజులుగా ప్రత్యేక టీమ్‌ల ద్వారా నమోదు చేశారు. శనివారం ఆయా గ్రామాల పరిధిలోని భూములను ప్రత్యేక టీమ్‌లు క్షేత్రస్థాయిలో పరిశీలించాయి. అనంతరం మర్కుక్ తహసీల్దార్ ఆఫీస్‌లో సర్వే బృందాలు సమావేశమై అప్పటి వరకు సేకరించిన వివరాలు, మ్యాప్‌లను పరిశీలించాయి.
కాస్రా, సేత్వార్ ప్రకారం సర్వే చేయండి..
ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌజ్ సమీప గ్రామాల్లో రెవెన్యూ ఆఫీసర్లు భూములను సర్వే చేస్తుండగా శివారు వెంకటాపూర్ రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఫామ్ హౌజ్ సమీపంలోని325 సర్వే నంబర్ లో 388 ఎకరాలుంటే ఇందులో 180 ఎకరాలు శివారు వెంకటాపూర్ గ్రామానికి సంబందించినవేనన్న విషయాన్ని రైతులు అధికారులకు తెలియజేశారు.
మొత్తం 388 ఎకరాల్లో 250 ఎకరాలు మాత్రమే ఎర్రవల్లి గ్రామస్తులవని, మిగిలిన 180 ఎకరాలు శివారు వెంకటాపూర్ గ్రామానికి చెందినవైతే వాటిని కూడా ఎర్రవల్లి గ్రామంలో కలుపుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న సర్వే వల్ల తమకు అన్యాయం జరగుతుందని కాస్రా, సెత్వార్ రికార్డుల ప్రకారం సర్వే చేయాలని డిమాండ్ చేశారు. గతంలో అధికారులు, సిబ్బంది చేసిన తప్పిదం వల్లే భూ రికార్డుల్లో తప్పులు నమోదు అయ్యాయని, శివారు వెంకటాపూర్ గ్రామంలోని దాదాపు 20 సర్వే నంబర్లలోని భూమి 325 సర్వే నంబర్ లో ఉన్నట్లుగా చూపిస్తున్నారని ఈ విషయంలో తమకు అన్యాయం జరిగితే సహించేది లేదని హెచ్చరించారు.
