భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని జీజీహెచ్ ఆవరణలో ఉన్న టీ హబ్‌లో నీటి సమస్య కారణంగా పది రోజులుగా బ్లడ్ టెస్టులు చేయడం నిలిపివేశారు. ప్రస్తుతం అత్యవసర రక్త పరీక్షలు మాత్రమే నిర్వహిస్తున్నారు. దీంతో జీజీహెచ్‌తో పాటు జిల్లాలోని ఏరియా ఆస్పత్రులు, 29 పీహెచ్‌సీల నుంచి వచ్చే రక్త నమూనాల పరీక్షలు ఆలస్యమవుతున్నాయి.
టీ హబ్‌కు నీటి సరఫరా నిలిచిపోవడంతో పాటు బోర్లు పనిచేయకపోవడం సమస్యకు కారణంగా తెలుస్తోంది. నీటి సమస్యను పరిష్కరించేందుకు కలెక్టర్ అంకిత్ ఆస్పత్రికి బోర్ మంజూరు చేసినా, మోటర్ ఏర్పాటు చేయకపోవడంతో వినియోగంలోకి రాలేదు.
టీ హబ్‌కు ప్రత్యేకంగా బోర్ ఏర్పాటు చేయాలని సిబ్బంది కోరుతున్నారు. రక్త నమూనాల పరీక్ష ఫలితాలు మూడు, నాలుగు రోజుల తర్వాత అందుతున్నాయని, దీంతో అవి ఉపయోగపడకుండా పోతున్నాయని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో రిపోర్టులు అందకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ ల్యాబ్‌లను ఆశ్రయించాల్సి వస్తోందని పేర్కొంటున్నారు.
