సంప్రదాయ నైపుణ్యాలకు ఆధునికత జోడించాలి : భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అంకిత్

సంప్రదాయ నైపుణ్యాలకు ఆధునికత జోడించాలి : భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అంకిత్

భద్రాద్రికొత్తగూడెం/ పాల్వంచ, వెలుగు: సంప్రదాయ నైపుణ్యాలకు ఆధునికత జోడించాలని భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అంకిత్ అన్నారు. ప్రపంచ వెదురు దినోత్సవం సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వెదురు ఆధారిత ఉత్పత్తులకు మార్కెట్‌‌‌‌‌‌‌‌లో ఉన్న అవకాశాలను చేతివృత్తిదారులు తమ నైపుణ్యాలతో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వెదురు పెంపకాన్ని ప్రోత్సహించేలా వ్యవసాయ, ఉద్యానవన, అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. 

అనంతరం పాల్వంచ ప్రభుత్వ వైద్యశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. బెడ్లు సరిపోక ఒకే బెడ్‌‌‌‌‌‌‌‌పై ఇద్దరు రోగులకు చికిత్స అందిస్తున్న పరిస్థితిపై అసంతృప్తి వ్యక్తం చేసి, వైద్యాధికారిని వివరణ కోరారు. ఆస్పత్రి విస్తరణకు మరో 50 బెడ్లతో ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. వార్డులు, ఎమర్జెన్సీ, క్యాజువాలిటీ, డయాలసిస్ సెంటర్, బ్లడ్ స్టోరేజ్ యూనిట్, ఆపరేషన్ థియేటర్లను పరిశీలించి, జ్వరాల వివరాలు, రికార్డులను తెలుసుకున్నారు. రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. జూలూరుపాడు పీహెచ్‌‌‌‌‌‌‌‌సీలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఆ మండలానికి చెందిన ప్రజలు కలెక్టర్‌‌‌‌‌‌‌‌ను కోరారు. అనంతరం కొత్తగూడెం కూలీ లైన్‌‌‌‌‌‌‌‌లోని పీఎంశ్రీ హైస్కూల్‌‌‌‌‌‌‌‌ను సందర్శించి విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని ఆదేశించారు. తహసీల్దార్ ఆఫీస్​లో సర్ ప్రోగ్రాం దరఖాస్తులను పరిశీలించి, అర్హులైన ఏ ఒక్కరి ఓటు మిస్ కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.