తెలంగాణలో కోటి మందికి  బీపీ, షుగర్.. ప్రతి నలుగురిలో ఒకరు బాధితులే

తెలంగాణలో కోటి మందికి  బీపీ, షుగర్..  ప్రతి నలుగురిలో ఒకరు బాధితులే
  • హైపర్ టెన్షన్ (హై బీపీ) 56,85,400
  • డయాబెటిస్‌‌‌‌‌‌‌‌ బాధితులు 47,95,700
  • సైలెంట్​గా గుండెపోటు, పక్షవాతం, కిడ్నీ జబ్బులకు దారి
  • మారిన లైఫ్‌‌‌‌‌‌‌‌స్టైల్, ఆహారపు అలవాట్లతో ఆరోగ్యానికి ముప్పు
  • కేంద్ర వైద్యారోగ్య శాఖ అంచనా ఇది
  • 25%  మందిని ఈ యేడు కంట్రోల్​లోకి తేవాలని రాష్ట్రానికి టార్గెట్
  • చర్యలు ప్రారంభించిన తెలంగాణ ప్రభుత్వం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బీపీ, షుగర్ బాధితుల సంఖ్య ప్రమాదకరస్థాయికి చేరింది. రాష్ట్ర జనాభాలో దాదాపు నాలుగో వంతు మంది ప్రజలు ఈ రెండు జీవనశైలి జబ్బులతో జీవిస్తున్నారని కేంద్ర వైద్యారోగ్య శాఖ అధికారికంగా అంచనా వేసింది. నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌ఎం) వార్షిక నివేదిక ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1.04 కోట్ల మందికి పైగా బీపీ, షుగర్ బారిన పడ్డారు. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే, ఐసీఎంఆర్ రిపోర్టుల ఆధారంగా.. కేంద్ర ప్రభుత్వం ఈ బీపీ, షుగర్ కేసులను అంచనా వేసింది. అయితే, ఈ మొత్తం బాధితుల్లో ఈ ఏడాది కనీసం 25 శాతం మంది రోగులను గుర్తించి, వారి బీపీ, షుగర్ స్థాయిలను సాధారణ స్థితికి తీసుకురావాలని రాష్ట్ర ఆరోగ్య శాఖకు లక్ష్యాన్ని నిర్దేశించింది.

హాస్పిటల్‌‌‌‌‌‌‌‌కు రాని కేసులను కూడా అంచనా వేసి 

రాష్ట్రంలో 56,85,400 మంది హైపర్ టెన్షన్, 47,95,700 మంది డయాబెటిస్‌‌‌‌‌‌‌‌తో బాధపడుతున్నట్టు కేంద్రం అంచనా వేసింది. ఈ రెండు వ్యాధుల బాధితులు కలిపి రాష్ట్రంలో మొత్తం కోటీ 4 లక్షల  81 వేల100 మంది ఉన్నారు. కేవలం హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌కు వచ్చి పరీక్షలు చేయించుకున్న కేసులను మాత్రమే కాకుండా, సమాజంలో ఇంకా వ్యాధి నిర్ధారణ కాకుండా తిరుగుతున్న బాధితులను కూడా కలిపి ఐసీఎంఆర్, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే రిపోర్టుల ఆధారంగా శాస్త్రీయ అంచనాలను రూపొందించింది. 

ప్రాథమిక దశలో ఎలాంటి నొప్పులు, లక్షణాలు కనిపించకపోవడం వల్ల చాలామంది తమకు ఈ జబ్బులు ఉన్నాయనే విషయాన్ని గుర్తించలేకపోతున్నారు. వయసుతో సంబంధం లేకుండా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో లక్షలాది మంది ప్రజలు ఈ నిశ్శబ్ద మహమ్మారుల బారిన పడుతున్నారని కేంద్రం లెక్కలు హెచ్చరిస్తున్నాయి.

అదుపు తప్పితే గుండె, కిడ్నీలపై ఎఫెక్ట్

మారుతున్న ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ తగ్గడం, పని ఒత్తిడి, అర్బన్ లైఫ్ స్టైల్ వల్ల చిన్న వయసులోనే బీపీ, షుగర్ అటాక్‌‌ అవుతున్నాయి. శరీరంలో రక్తపోటు, గ్లూకోజ్ స్థాయిలు దీర్ఘకాలికంగా అదుపు తప్పడం వల్ల గుండెపోటు, పక్షవాతం, కిడ్నీలు దెబ్బతినడం, ఫ్యాటీ లివర్‌‌‌‌లాంటి ప్రాణాంతక సమస్యలు వస్తున్నాయని నివేదిక స్పష్టం చేసింది. చాలామందికి గుండెనొప్పి లేదా పక్షవాతం వచ్చే వరకు తమకు బీపీ, షుగర్ ఉన్నట్టు తెలియడం లేదు. మరికొందరు మందులు వాడుతూ మధ్యలోనే ఆపేయడం వల్ల ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. పెద్దల్లోనే కాకుండా స్కూల్  విద్యార్థుల్లోనూ మధుమేహం పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం (ఆర్బీఎస్‌‌కే) కింద పిల్లల్లోనూ డయాబెటిస్ పరీక్షలు చేయాలని కేంద్రం ఆదేశించింది.

క్షేత్రస్థాయిలో పరీక్షలు చేస్తేనే.. 

ఈ లక్ష్యాన్ని అందుకోవాలంటే క్షేత్రస్థాయిలో పరీక్షలు వేగవంతం చేయాలని కేంద్రం పేర్కొన్నది. 30 ఏండ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ గ్రామాల్లో, బస్తీల్లో పాపులేషన్ బేస్డ్ స్క్రీనింగ్ నిర్వహించాల్సి ఉంటుంది. వ్యాధి నిర్ధారణ అయిన వారి వివరాలను నేషనల్ ఎన్‌‌సీడీ పోర్టల్‌‌లో నమోదు చేసి నిరంతరం పర్యవేక్షించాలి. 

26 లక్షల మందికి నార్మల్‌‌‌‌‌‌‌‌ చేయాలని టార్గెట్‌‌‌‌‌‌‌‌

అంచనా వేసిన కోటి మందికి పైగా రోగుల్లో.. ఈ ఏడాది  25 శాతం మందిలో రీడింగులను పూర్తిగా నియంత్రణలోకి తీసుకురావాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకున్నది. ఈ లెక్కన 56.85 లక్షల మంది బీపీ బాధితుల్లో 14,21,350 మందిని, అలాగే 47.95 లక్షల మంది షుగర్ బాధితుల్లో 11,98,930 మందికి మందుల ద్వారా అదుపులోకి తీసుకురావాల్సి ఉంటుంది. అంటే మొత్తం మీద 26,20,280 మంది రోగుల రక్తపోటు, షుగర్ స్థాయిలను నార్మల్ రీడింగ్‌‌‌‌‌‌‌‌లకు తేవాలనే లక్ష్యాన్ని కేంద్రం నిర్దేశించింది. కేంద్ర ప్రభుత్వం లక్ష్యాలకు తగ్గట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది.