- సుంకాలపై ప్రెసిడెంట్‌కు ఫుల్ పవర్స్
- ఎంత శాతం విధించేది ఆయన చేతిలోనే..!
- రష్యా వస్తువులపై 500% సుంకాలకు చాన్స్
- చైనాపై కూడా 100% విధించే అవకాశం
వాషింగ్టన్: రష్యా నుంచి అత్యధికంగా చమురు, గ్యాస్ కొనుగోలు చేసే దేశాలపై100 శాతం వరకు టారిఫ్‌లు విధించేందుకు తెచ్చిన ‘రష్యా ఆంక్షల బిల్లు’పై అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. గత నెలలో సెనేట్, రెండు రోజుల క్రితం ప్రతినిధుల సభ ఆమోదించిన ‘లిండ్సే ఓ గ్రామ్ శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ ఆఫ్ 2026’ బిల్లుపై అధ్యక్షుడు సంతకం చేయడంతో ఇది చట్టరూపం దాల్చింది. దీంతో రష్యా నుంచి అత్యధికంగా చమురు కొనుగోలు చేస్తున్న చైనా, భారత్ సహా పలు దేశాలపై 100% వరకూ టారిఫ్‌లు విధించేందుకు ట్రంప్‌కు అధికారం లభించింది. అయితే, ఎంత శాతం టారిఫ్‌లను విధిస్తారన్నది పూర్తిగా ట్రంప్ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. ఒకవేళ డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై 100% సుంకం విధిస్తే, అది ఇప్పటికే అమెరికా విధించిన 10% టారిఫ్‌లకు అదనంగా ఉంటుంది. వెట్టిచాకిరీతో తయారైన వస్తువుల దిగుమతిని అణచివేయడానికి తగిన చర్యలు తీసుకోవడంలేదనే నెపంతో భారత్ నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై అమెరికా ప్రస్తుతం ఈ పెనాల్టీ విధిస్తోంది.
గత ఏడాది రష్యా ముడిచమురు దిగుమతులపై ట్రంప్ అదనంగా 25% సుంకం, మరో 25% పరస్పర సుంకం విధించడంతో భారత్, అమెరికా సంబంధాలు దెబ్బతిన్నాయి. అయితే, 2026 ఫిబ్రవరిలో అదనపు సుంకాలను తొలగించగా, పరస్పర సుంకాన్ని 18 శాతానికి తగ్గించారు. కాగా, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి ఊతమిస్తోన్న ఆర్థిక వనరులను కట్టడి చేయడం ద్వారా రష్యాపై ఒత్తిడి తెచ్చేందుకుగాను అమెరికా ఈ చట్టాన్ని తెచ్చింది. రష్యా వస్తువులపై 500% వరకు సుంకాలు విధించాలని ఈ చట్టం నిర్దేశిస్తోంది. రష్యా చమురు, గ్యాస్ కొనుగోలు నిబంధనల పరిధిలోకి వచ్చే దేశాల వస్తువులపై వంద శాతం వరకు సుంకాలు విధించేందుకు ఇది వీలు కల్పిస్తోంది.
ఎరిట్రియాపై ఆంక్షల ఎత్తివేత
ఎర్ర సముద్రం, బాబ్ ఎల్ మాండెబ్ జలసంధి దక్షిణ తీరంలోని కీలకమైన ఎరిట్రియా దేశంపై గతంలో విధించిన ఆంక్షలను అమెరికా ఎత్తివేసింది. ఎరిట్రియా అధికార పార్టీకి చెందిన రెడ్ సీ ట్రేడింగ్ కార్పొరేషన్‌పై కూడా ఆంక్షలను విత్ డ్రా చేసుకుంది.
