- భారీగా తరలివచ్చిన నిరుద్యోగులు
- హాజరైన మంత్రులు, స్పీకర్, మండలి చైర్మన్
సూర్యాపేట, వెలుగు: సూర్యాపేట జిల్లా కోదాడలో శనివారం నిర్వహించిన మెగా జాబ్ మేళాలో వేలాది మంది నిరుద్యోగులకు కొలువులు దక్కాయి.ఈ జాబ్‌మేళాకు సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల నుంచి భారీ సంఖ్యలో నిరుద్యోగులు తరలివచ్చారు. సమాచార సాంకేతికత, ఫార్మా, తయారీ, విమానయానం, మౌలిక సదుపాయాలు, వైద్యం, బ్యాంకింగ్, రిటైల్ రంగాలకు చెందిన 350 కంపెనీలు పాల్గొన్నాయి. ఫాక్స్ కాన్, ఎల్‌అండ్‌టీ, ఎంఐఏఎల్, మహీంద్రా, టాటా, అరవింద్, ఎంఎస్‌ఎన్, మెట్రో, గూగుల్, ఇండిగో, అపోలో, మెడ్‌ప్లస్‌తో పాటు అనేక ప్రముఖ సంస్థలు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ముందుకొచ్చాయి. 32 వేల మంది తమ పేర్లను నమోదు చేసుకోగా, వివిధ కంపెనీలు 5,725 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేశాయి. ఇంటర్వ్యూలు, స్క్రీనింగ్ పూర్తయిన వెంటనే అభ్యర్థులకు కంపెనీల ప్రతినిధులు నియామకపత్రాలు అందజేశారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, కోదాడ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి జాబ్ మేళాను సందర్శించారు. ఉద్యోగాలు సాధించిన వారికి నియామకపత్రాలు అందజేసి అభినందించారు.
ఎనలేని సంతృప్తి ఇచ్చింది: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
గ్రామీణ ప్రాంత యువతకు నేరుగా ఉపాధి అవకాశాలు కల్పించడం తనకు ఎనలేని సంతృప్తినిచ్చిందని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి తెలిపారు. ‘స్కూళ్లు, కాలేజీలు కట్టడం, రోడ్లు వేయడం, ఎత్తిపోతల పథకాలు, కరెంట్ సబ్‌స్టేషన్లు ఏర్పాటు చేయడం ఒకెత్తయితే, మన పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించినప్పుడు కలిగే ఆనందం గొప్పది’ అని పేర్కొన్నారు. సరిహద్దు ప్రాంతమైనప్పటికీ 350 కంపెనీలను రప్పించామన్నారు. హైదరాబాద్‌లోని ఫాక్స్‌కాన్ వంటి దిగ్గజ సంస్థల వద్దకు గ్రామీణ ఇంజినీరింగ్ విద్యార్థులు నేరుగా వెళ్లలేకపోతున్నారని, దీనిని దృష్టిలో ఉంచుకొని కంపెనీలనే యువత ముంగిటకు తెచ్చామని చెప్పారు.
ఉద్యోగం రాని వాళ్లు నిరుత్సాహపడొద్దని, కంపెనీలతో మాట్లాడి పరిశీలనలో ఉన్న అభ్యర్థులకు అవకాశం దక్కేలా చూస్తామని తెలిపారు. మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ కోదాడలో త్వరలోనే టాస్క్ సెంటర్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. గ్రామీణ యువతలో నైపుణ్యాలను పెంచి, పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా వారిని తీర్చిదిద్దడమే ప్రజా ప్రభుత్వం లక్ష్యమన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం నిరుద్యోగ యువత భవిష్యత్తుకు బలమైన పునాదులు వేస్తోందని తెలిపారు. యువతకు ఉపాధి కల్పించేందుకు మెగా జాబ్ మేళా నిర్వహించడం సంతోషకరమని చెప్పారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, పద్మావతి రెడ్డి దంపతులకు ప్రజలు అండగా ఉండాలని పిలుపునిచ్చారు.
మన దగ్గరే కొలువులు కొట్టాలి: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
ప్రస్తుతం విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు తగ్గిపోయాయని, స్థానికంగానే కొలువులు సంపాదించాలని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సూచించారు. ఇంట్లో ఒక్కరికి ఉద్యోగం వస్తే, ఆ ఫ్యామిలీ భవిష్యత్తు మారిపోతుందని తెలిపారు. ప్రజాప్రభుత్వం ఇప్పటివరకు 60 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసిందని, యువతకు ఉపాధి, ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా సర్కారు పని చేస్తోందని చెప్పారు. ప్రస్తుతం ఏఐ కాలం నడుస్తోందని, యువత తమ నైపుణ్యాలను అప్‌డేట్ చేసుకోవాలని సూచించారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగం అంటే సర్కారు కొలువే కాదని, ప్రైవేట్ రంగంలోనూ లక్షలాది అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ప్రైవేట్ రంగంలోని అవకాశాలను అందిపుచ్చుకొని జీవితంలో స్థిరపడాలని సూచించారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు బత్తుల లక్ష్మారెడ్డి, కుంభం అనిల్ కుమార్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ నరసింహ, డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య, పున్నా కైలాష్ నేత, ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్, టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి పాల్గొన్నారు.
