- బడి తెరిచిన రోజే రెండు జతలు ఇవ్వాలె
- అదే రోజు పుస్తకాలు చేతికిచ్చేలా ప్లాన్ చేయండి
- ఈ ఏడాది తొలి విడత యూనిఫాంలు ఇచ్చేశాం
- నెలాఖరుకు రెండో జత కూడా ఇవ్వబోతున్నం
- హాస్టళ్లలో ప్లేట్లు, కార్పెట్లు, బెడ్‌షీట్లు అందించాం
- విద్యాశాఖ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు బడులు, సంక్షేమ వసతిగృహాలు, గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి మరింత ఆకర్షణీయ రంగుల్లో, ప్రైవేటు స్కూళ్లకు దీటుగా సరికొత్త డిజైన్లతో యూనిఫాంలు అందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. స్కూళ్లు రీఓపెన్అయిన తొలిరోజే విద్యార్థులందరి చేతుల్లోకి రెండు జతల యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు, ఇతర సామగ్రి చేరేలా ఇప్పటి నుంచే పక్కా యాక్షన్‌ప్లాన్ రెడీ చేయాలని స్పష్టం చేశారు. సర్కారు బడులపై ప్రజల్లో నమ్మకం పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే ఏడాది ప్రస్తుత విద్యార్థుల సంఖ్య కంటే అదనంగా 10 శాతం మంది చేరే అవకాశం ఉందని, అందుకు అనుగుణంగా ముందస్తు నిల్వలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు.
విద్యార్థుల యూనిఫాంలు, నోట్ పుస్తకాలు, సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు అవసరమైన సామగ్రి పంపిణీ ప్రక్రియపై శనివారం సెక్రటేరియెట్‌లో ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. వచ్చే ఏడాది పాఠశాలలు తెరిచిన తొలిరోజే రెండు జతల దుస్తులు, నోట్ పుస్తకాలు అందేలా ఇప్పటి నుంచే కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. అదనపు డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని బట్ట సేకరణ, కుట్టుపని, ఇతర వస్తువుల నిల్వలకు సంబంధించిన టెండర్లు, ప్రణాళికలను వేగవంతం చేయాలని సూచించారు. యూనిఫాంల విషయంలో పాత పద్ధతులకు స్వస్తి పలికి, పిల్లలను ఆకట్టుకునేలా వైవిధ్యమైన రంగులు, ఆధునిక డిజైన్లను ఎంపిక చేసేందుకు ప్రత్యేకంగా ప్రయత్నించాలని చెప్పారు.
ప్రస్తుత ఏడాది పంపిణీపై సమీక్ష
ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ స్కూళ్ల విద్యార్థులందరికీ మొదటి విడత యూనిఫాం పంపిణీ విజయవంతంగా పూర్తయిందని అధికారులు సీఎంకు వివరించారు. ఈ నెలాఖరు నాటికి అర్హులైన విద్యార్థులందరికీ రెండో జత యూనిఫాంలను కూడా 100% అందజేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కేజీబీవీలు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మోడల్ స్కూళ్ల విద్యార్థినీ విద్యార్థులకు ఇప్పటికే రెండు జతల యూనిఫాంలను పూర్తిస్థాయిలో పంపిణీ చేశామని వెల్లడించారు. ప్రభుత్వం నిర్దేశించిన సిలబస్‌కు అనుగుణంగా విద్యార్థులందరికీ అవసరమైన పూర్తి స్థాయి నోట్ పుస్తకాల పంపిణీ కూడా పూర్తయిందని అధికారులు వివరించారు.
హాస్టళ్లకు సామగ్రి అందజేత
ప్రభుత్వ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, కేజీబీవీలు, ఆదర్శ పాఠశాలల్లో నివసిస్తున్న పేద విద్యార్థులకు నాణ్యమైన స్టీలు ప్లేట్లు, గ్లాసులు, భోజన కటోరాలు, స్పూన్లు, వాటర్ కప్పులను సమగ్రంగా అందించినట్లు తెలిపారు. హాస్టళ్లలో బస చేసే విద్యార్థులకు అవసరమైన కార్పెట్లు, బెడ్‌షీట్లు, మెత్తటి టవళ్ల పంపిణీ ప్రక్రియ కూడా 100% పూర్తయిందని ఉన్నతాధికారులు సీఎంకు వివరించారు. ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వం అందజేసిన యూనిఫాంలు, నోట్ పుస్తకాలు, హాస్టల్ సామగ్రి నాణ్యతపై విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి పెద్దఎత్తున సంతృప్తి వ్యక్తమవుతోందని సీఎం ప్రశంసించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా దుస్తుల మన్నిక, హాస్టల్ సామగ్రి నాణ్యత విషయంలో పకడ్బందీ ప్రమాణాలు పాటించడం వల్ల క్షేత్రస్థాయిలో సానుకూల ఫలితాలు వస్తున్నాయని పేర్కొన్నారు. సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, సీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీ వి.శ్రీధర్, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు పాల్గొన్నారు. వీరితో పాటు వివిధ సంక్షేమ, విద్యా శాఖల ముఖ్య కార్యదర్శులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
