సింగరేణి కార్మికుల ఇండ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం

సింగరేణి కార్మికుల ఇండ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం
  • చట్టబద్ధమైన హక్కులు కల్పించేందుకు మార్గదర్శకాలు విడుదల
  • 45 రోజుల్లోగా దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించాలని ప్రభుత్వం ఆదేశం
  • జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో ప్రత్యేక త్రిసభ్య కమిటీల ఏర్పాటు
  • జీవో 76కు అనుగుణంగా చట్టబద్ధమైన హక్కులు

హైదరాబాద్, వెలుగు: సింగరేణి కార్మికులు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న ఇండ్ల స్థలాల సమస్యకు రాష్ట్ర ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపింది. కోల్ బెల్ట్ ప్రాంతంలో వేలాది కుటుంబాలు నివసిస్తున్న ఇండ్ల స్థాలపై చట్టబద్ధమైన హక్కు కల్పించేందుకు మార్గదర్శకాలు విడుదల చేసింది. అసెంబ్లీలో జరిగిన చర్చకు అనుగుణంగా, రిజిస్ట్రేషన్ల చట్టంలోని సెక్షన్ 22-ఏ నిషేధిత జాబితా చిక్కుముడులను విప్పుతూ రెవెన్యూ శాఖ ప్రత్యేక మెమో నం.47936 జారీ చేసింది.

సింగరేణి విస్తరించి ఉన్న 8 జిల్లాల్లోని పెండింగ్ దరఖాస్తులను 45 రోజుల్లోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ల నేతృత్వంలోని త్రిసభ్య కమిటీలకు ఆదేశాలు ఇచ్చారు. వైఎస్సార్​హయాంలో తెచ్చిన జీవో 76ను పరిగణనలోకి తీసుకుంటూ సింగరేణి కార్మిక కుటుంబాల చిరకాల స్వప్నాన్ని నెరవేర్చేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.

8 జిల్లాల్లో యుద్ధప్రాతిపదికన చర్యలు..

సింగరేణి కార్మికుల ఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణ ప్రక్రియను పకడ్బందీగా అమలు చేయనున్నారు. కోల్ బెల్ట్ విస్తరించి ఉన్న ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో పెండింగ్‌‌‌‌లో ఉన్న దరఖాస్తుల పరిష్కారానికి జిల్లాలవారీగా ప్రత్యేక త్రిసభ్య కమిటీలను ఏర్పాటు చేశారు. దీనికి జిల్లా కలెక్టర్ చైర్మన్‌‌‌‌గా వ్యవహరించనుండగా, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నామినేటెడ్ ప్రతినిధి, జిల్లా రిజిస్ట్రార్లు సభ్యులుగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తారు.

హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులు, ఆదేశాలకు లోబడి రాబోయే 45 రోజుల్లోగా వచ్చిన ప్రతి దరఖాస్తును ఈ కమిటీ సమగ్రంగా విచారించి పరిష్కారం చూపాల్సి ఉంటుంది. సుదీర్ఘకాలంగా రెవెన్యూ, సింగరేణి యాజమాన్యాల మధ్య నలుగుతున్న భూముల యాజమాన్య వివాదాలను పరిష్కరిస్తూ, సెక్షన్ 22-ఏ కింద రిజిస్ట్రేషన్ కాకుండా నిలిచిపోయిన స్థలాలకు పూర్తిస్థాయిలో విముక్తి కల్పించడమే ఈ కమిటీ ప్రధాన ఉద్దేశం. గడువులోగా అర్హులైన లబ్ధిదారులను గుర్తించి భూ సర్వే నంబర్ల వారీగా రిపోర్టులు రెడీ  చేసి ప్రభుత్వానికి, సీసీఎల్‌‌‌‌ఏకు ఇవ్వాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

అక్రమాలకు తావులేకుండా విచారణ..

దరఖాస్తుల పరిశీలనలో ఎలాంటి అవకతవకలు, అక్రమాలకు తావులేకుండా క్షేత్రస్థాయి నిబంధనలు, చట్టాలకు లోబడి పారదర్శకంగా తుది నిర్ణయం తీసుకోవాలని మంత్రి పొంగులేటి అధికారులను ఆదేశించారు. సింగరేణి ప్రాంతంలో నిజమైన కార్మికులు, పేదలు నిర్మించుకున్న ఇండ్లకు చట్టబద్ధమైన రక్షణ కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఎవరైనా అనర్హులు ఉంటే నిబంధనల ప్రకారం తిరస్కరించాలన్నారు. . జిల్లా స్థాయి అధికారులు, సింగరేణి ఉన్నతాధికారులు నిరంతరం సమన్వయం చేసుకుంటూ కార్మికవాడల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహించి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.