- 22ఏ సమస్యలకు త్వరలో ముగింపు
- 12 అంశాల్లో ఇప్పటికే రెండింటికి జీవోలు జారీ
- మరికొన్ని అంశాలపై త్వరలో తీపికబురు
- మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడి
ఎల్బీనగర్, వెలుగు: ఎల్బీనగర్లోని 44 కాలనీల ఇండ్లను క్రమబద్ధీకరించినట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించిన 12 అంశాల్లో ఇప్పటికే జీవో 118, జీవో 76ను జారీ చేశామని చెప్పారు. మిగిలిన సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని తెలిపారు. సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో ఎల్బీనగర్ నియోజకవర్గంలోని 44 కాలనీల ఇండ్ల క్రమబద్ధీకరణకు సంబంధించిన ధ్రువపత్రాలను మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్‌తో కలిసి పొంగులేటి శనివారం లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్యూర్ ప్రాంతాన్ని ప్రపంచంలోనే నంబర్ వన్‌గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. రైతు సమస్యల పరిష్కారానికి ఆధార్ కార్డు మాదిరిగా భూధార్ కార్డులు ఇస్తామని తెలిపారు. ఇటీవల శాసనసభలో భూ సమస్యలపై సుదీర్ఘంగా చర్చించామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు సరూర్‌నగర్ నియోజకవర్గంలోని 44 కాలనీల సమస్యలను పరిష్కరించామని చెప్పారు.
గత ప్రభుత్వం నుంచి నిషేధిత ఉత్తర్వులున్నా వాటిని నెల రోజుల్లో పరిష్కరించి ఇండ్లను రెగ్యులరైజ్ చేస్తామని వివరించారు. జీవో 118 సహకారంతో మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోని మరికొంత మందికి కూడా నెలలోపు సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. ఈ ప్రాంత కాలనీలు చాలా కాలం నుంచి 22ఏ జాబితాలో ఉన్నాయని పేర్కొన్నారు.
త్వరలో ప్రభుత్వం తీపి కబురు..
22ఏకు సంబంధించి త్వరలో ప్రభుత్వం తీపి కబురు చెబుతుందని మంత్రి పొంగులేటి వెల్లడించారు. 22ఏ అనే చట్టం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి అమల్లో ఉందని, కొంతమంది దీనిని ఆసరాగా చేసుకొని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వారం రోజుల్లో సమస్య పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని వివరించారు. సింగరేణి ప్రాంతంలో ఇండ్ల స్థలాల రెగ్యులరైజేషన్‌కు సంబంధించిన జీవో 76ను అమలు చేయబోతున్నామని, దీనికోసం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశామని వెల్లడించారు. మరో 45 రోజుల్లో పూర్తిస్థాయిలో భూ సమస్యను పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి, ఎల్బీనగర్ కాంగ్రెస్ ఇన్‌చార్జి మధుయాష్కీగౌడ్ పాల్గొన్నారు.
క్యూర్ పరిధిలో 21 వేల డబుల్ ఇండ్లు పూర్తి: పొంగులేటి
క్యూర్ పరిధిలో 21 వేల డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తయినట్లు హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన ఇండ్లను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు పూర్తి చేశామన్నారు. శనివారం సెక్రటేరియెట్ నుంచి రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ కలెక్టర్లు, హౌసింగ్, వాటర్ వర్క్స్, విద్యుత్ అధికారులతో మంత్రి పొంగులేటి, హౌసింగ్ శాఖ స్పెషల్ సెక్రటరీ వీపీ గౌతమ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. క్యూర్ పరిధిలోని 26 ప్రాంతాల్లో గత ప్రభుత్వం ప్రారంభించి వదిలేసిన 21 వేల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పూర్తి చేసినట్లు వెల్లడించారు. ఈ ఇండ్లకు ఈ నెల 30వ తేదీలోగా డ్రా నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేసి వారి వివరాలను ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఫైనల్ నోటీస్ ఇచ్చి రద్దు చేయండి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో ఉన్న అనర్హులను తొలగించాలని, ఆ ఇండ్లలో నివసించని వారికి ఫైనల్ నోటీస్ ఇచ్చి రద్దు చేయాలని కలెక్టర్లకు మంత్రి పొంగులేటి ఆదేశించారు.
నోటీసులకు స్పందించని వారి ఇండ్లను రద్దు చేసి వారి స్థానంలో అర్హులను ఎంపిక చేయాలని సూచించారు. క్యూర్ పరిధిలో ఇంటి స్థలాలు ఉండి అర్హులైన 9 వేల మందికి ఇండ్లను మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు.
