- నెల రోజులు జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా
- హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను ఉల్లంఘించిన నిందితుడి అరెస్ట్
హైదరాబాద్, వెలుగు: కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి నిందితుడిని అరెస్ట్ చేసిన కేసులో సరూర్‌నగర్ అప్పటి ఏసీపీ ఎ.కృష్ణయ్యకు హైకోర్టు నెల రోజుల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించింది. సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో నిందితుడు కట్టా వంశీకృష్ణను అరెస్ట్ చేయరాదంటూ హైకోర్టు ఏప్రిల్ 21న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులను 23, 27 తేదీల్లో న్యాయస్థానం పొడిగించింది. అయితే, ఆ ఉత్తర్వులు అమల్లో ఉన్నప్పటికీ ఏప్రిల్ 28న వంశీకృష్ణను ఏసీపీ అరెస్ట్ చేశారు.
దీంతో బాధితుడు కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది వాదిస్తూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వంశీకృష్ణను డాక్టర్లపై ఒత్తిడి తెచ్చి డిశ్చార్జ్ చేయించి మరీ అరెస్ట్ చేశారని తెలిపారు. హైకోర్టు ఉత్తర్వులు చూపించినప్పటికీ ఏసీపీ పట్టించుకోలేదని, కింది కోర్టు కూడా ఆ ఉత్తర్వులను పరిశీలించి రిమాండ్‌ను తిరస్కరించిందని పేర్కొన్నారు. ఈ విచారణకు వ్యక్తిగతంగా హాజరైన ఏసీపీ.. మధ్యంతర ఉత్తర్వుల పొడిగింపు విషయం తనకు తెలియదని చెబుతూ బేషరతుగా క్షమాపణ కోరారు.
అయితే, ఈ వాదనను న్యాయమూర్తి జస్టిస్ కె.సుజన తిరస్కరించారు. అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ మొదట జారీ చేసిన ఉత్తర్వులు ఏసీపీకి తెలుసని, వాటిని పొడిగించారా.. లేదా..? అనేది తెలుసుకోవాల్సిన కనీస బాధ్యత దర్యాప్తు అధికారిపై ఉంటుందని స్పష్టం చేశారు. హైకోర్టు వెబ్‌సైట్‌ను పరిశీలించడం గానీ, పబ్లిక్ ప్రాసిక్యూటర్ నుంచి సమాచారం తీసుకోవడం గానీ చేయకుండా అరెస్ట్ చేయడం కోర్టు ఆదేశాల ఉల్లంఘనేనని తేల్చిచెప్పారు.
ఈ నేపథ్యంలో ఏసీపీ బేషరతు క్షమాపణను తోసిపుచ్చుతూ శిక్ష ఖరారు చేశారు. కాగా, ప్రభుత్వం అప్పీలుకు వెళ్లేందుకు అవకాశం కల్పించాలన్న ప్రభుత్వ న్యాయవాది అభ్యర్థన మేరకు తీర్పు అమలును అక్టోబర్ 19 వరకు హైకోర్టు నిలిపివేసింది. ఇదే కేసులో ప్రతివాదిగా ఉన్న ఎస్సై వి.మారయ్య దర్యాప్తు, అరెస్ట్‌లో ప్రత్యక్షంగా పాల్గొనలేదని తేలడంతో ఆయనపై ఉన్న కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను కొట్టివేశారు.
