- డెలివరీ బాయ్స్, డ్రైవర్లు, ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్‌లు, కస్టమర్ సపోర్ట్ జాబ్స్‌కు భారీ డిమాండ్
- టైర్ 1, 2 సిటీల్లోనే ఎక్కువ నియామకాలు
- గతేడాదితో పోలిస్తే 20 శాతం వృద్ధి నమోదవుతుందని అంచనా
- ఎన్‌ఎల్‌బీ సర్వీసెస్ రిపోర్ట్ వెల్లడి
న్యూఢిల్లీ: దసరా, దీపావళి, క్రిస్మస్ పండుగలు సమీపిస్తుండడంతో టెంపరరీ జాబ్స్ కోసం నియామకాలు పుంజుకున్నాయి. ఈ ఏడాది పండుగ సీజన్ (జులై– డిసెంబర్) లో ఏకంగా 2 లక్షల నుంచి 2.5 లక్షల వరకు సీజనల్, గిగ్ ఉద్యోగాలు (తాత్కాలిక ఉపాధి అవకాశాలు) నియామకాలు జరుగుతాయని హెచ్‌ఆర్ కంపెనీ ఎన్‌ఎల్‌బీ సర్వీసెస్ తన రిపోర్ట్‌లో పేర్కొంది. కిందటేడాది పండుగ సీజన్‌తో పోలిస్తే 20శాతం వృద్ధి నమోదవుతుందని అంచనావేసింది.
డిమాండ్ ఎందుకంటే?
పండుగల సమయాల్లో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ–-కామర్స్ దిగ్గజాలు 'బిగ్ బిలియన్ డేస్', 'గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్' పేరుతో భారీ డిస్కౌంట్ సేల్స్ ప్రకటిస్తాయి. అదే సమయంలో బ్లింకిట్, జెప్టో, ఇన్‌స్టామార్ట్ లాంటి క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు నిమిషాల వ్యవధిలోనే కిరాణా వస్తువులు, పండుగ సామగ్రిని డెలివరీ చేసేందుకు పోటీపడతాయి. మరోవైపు దుస్తుల దుకాణాలు, ఎలక్ట్రానిక్స్ షోరూమ్‌లు, మాల్స్, హోటళ్లు, రెస్టారెంట్లు, ట్రావెల్స్ సంస్థల్లో కస్టమర్ల రద్దీ సాధారణ రోజుల కంటే రెట్టింపు అవుతుంది. దీంతో డిమాండ్‌ను చేరుకోవడానికి కంపెనీలు తాత్కాలిక ఉద్యోగులను భారీ సంఖ్యలో నియమించుకుంటాయి. ముఖ్యంగా డెలివరీ బాయ్స్, డ్రైవర్లు, ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్‌లు, వేర్‌హౌస్ మేనేజ్ చేయడం, ప్యాకింగ్, లేబులింగ్, బార్‌కోడ్ స్కానింగ్, డార్క్ స్టోర్‌లలో ఇన్వెంటరీని తనిఖీ చేయడం, బిల్లింగ్ కౌంటర్లలో పనిచేసేవారికి డిమాండ్ ఉంటుంది. వీటితోపాటు ఆర్డర్ ట్రాకింగ్, రీఫండ్ సమస్యల పరిష్కారం, క్యాటలాగ్ అప్‌డేట్స్, ఫ్రాడ్ ట్రాన్సాక్షన్లను గుర్తించడం వంటి విభాగాల్లో, హోటళ్లు, క్యాటరింగ్, ఈవెంట్ నిర్వహణలో హెల్పర్ల రోల్స్ కోసం హైరింగ్ జరుగుతుంది.
చిన్న సిటీలలోనే ఎక్కువ
గతంలో ఇలాంటి ఉద్యోగావకాశాలు కేవలం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, ఢిల్లీ వంటి మెట్రో నగరాలకే పరిమితమయ్యేవి. అయితే ఇంటర్నెట్, యూపీఐ డిజిటల్ చెల్లింపుల విస్తరణతో చిన్న పట్టణాల్లోనూ ఆన్‌లైన్ షాపింగ్ విస్తరించింది. దీంతో మొత్తం తాత్కాలిక నియామకాల్లో దాదాపు 45 శాతం వాటా టైర్-2, టైర్-3 నగరాల నుంచే వస్తోందని అంచనా. ఈ ప్రాంతాల్లో గతేడాదితో పోలిస్తే నియామకాలు 25 నుంచి 30 శాతం వరకు పుంజుకోనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, వరంగల్, కర్నూలు, గుంటూరులతో పాటు లక్నో, జైపూర్, ఇండోర్, నాగ్‌పూర్, భువనేశ్వర్, సూరత్, కోయంబత్తూర్, కొచ్చి వంటి నగరాల్లో లాజిస్టిక్స్ హబ్‌లు, డార్క్ స్టోర్లు విస్తరించడం వల్ల గ్రామీణ, పట్టణ యువత సొంత ఊళ్లను వీడకుండానే ఆదాయం సంపాదించే అవకాశం దక్కనుంది. తాత్కాలిక ఉద్యోగులుగా చేరినా, పర్మినెంట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది.
