ఆర్టీసీ ఎన్నికల్లో కార్మికులు స్వచ్ఛందంగా పాల్గొనాలి : మంత్రి పొన్నం ప్రభాకర్

ఆర్టీసీ ఎన్నికల్లో కార్మికులు స్వచ్ఛందంగా పాల్గొనాలి : మంత్రి పొన్నం ప్రభాకర్
  • గుర్తింపు సంఘం ఎన్నికల తర్వాత విలీన ప్రక్రియను ప్రారంభిస్తాం
  • రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్, వెలుగు: వచ్చే నెల 9న జరిగే ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో కార్మికులు స్వచ్ఛందంగా పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. శనివారం ఆయన హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. దశాబ్ద కాలం తర్వాత ఆర్టీసీ కార్మిక సంఘాల ఎన్నికలను నిర్వహించి, కార్మికులకు వారు కోల్పోయిన హక్కులను తిరిగి అందిస్తున్నామని, ఇది ప్రజా పాలనలోనే సాధ్యమైందన్నారు. ఈ ఎన్నికల్లో గెలిచే సంఘం ప్రతినిధులను అధికారుల కమిటీలో భాగస్వామ్యం చేసి, ఆర్టీసీ విలీన ప్రక్రియను ప్రారంభిస్తామని మంత్రి స్పష్టం చేశారు.

ఇతర రాష్ట్రాల్లో ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం అయిన తర్వాత తలెత్తిన ఇబ్బందులు తెలంగాణలో పునరావృతం కాకుండా, కార్మికుల ప్రయోజనాలను పరిరక్షించేలా ముందుకు వెళ్తామన్నారు. ఆర్టీసీ కార్మికులు కేవలం ఉద్యోగులు మాత్రమే కాదని, ప్రజా రవాణా వ్యవస్థకు వెన్నెముక అని పొన్నం కొనియాడారు. కార్మికుల హక్కులను కాపాడడం, సంక్షేమాన్ని పరిరక్షించడం ప్రజా ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ చర్యలను మంత్రి వివరించారు.

ఆటో డ్రైవర్ల సమస్యలకు త్వరలో పరిష్కారం

ఆటోడ్రైవర్ల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్​ పేర్కొన్నారు. ఆదివారం తెలంగాణ ఆటో సంఘాల జేఏసీ నాయకులు మంత్రి నివాసంలో కలిశారు. ఆటోడ్రైవర్ల సంక్షేమానికి ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్​ చేశారు. స్పందించిన మంత్రి ఆటోసంఘాల డిమాండ్లలో ఒకటైన మీటర్​చార్జీల పెంపునకు త్వరలోనే జీవో జారీ చేస్తామని హామీఇచ్చారు. వెల్ఫేర్​బోర్డు గురించి కూడా చర్చించారు.