వెలుగు స్పెషల్ : అభినవ కృష్ణ, కుచేలురు..నాయకుల పెత్తనం.. సామాన్యులకు ఇబ్బందులు

వెలుగు స్పెషల్ : అభినవ కృష్ణ, కుచేలురు..నాయకుల పెత్తనం.. సామాన్యులకు ఇబ్బందులు

ఈ మధ్య  ప్రధానమంత్రి  నరేంద్ర మోదీని ఆయన చిన్ననాటి మిత్రుడు అస్గర్ అలీ వోరా కలిసి..  వివాదాల్లో  చిక్కుకున్న తన భూమి కాపాడమని కోరిన వార్త పత్రికల్లో వచ్చింది.  వారం రోజుల తర్వాత అస్గర్ అలీ భూమి తిరిగి ఆయనకు  దక్కిన వార్త కూడా వచ్చింది.  

81 ఏళ్ల అస్గర్ అలీ  మహారాష్ట్రలోని థానే నివాసి. ఆయన 1989లో ముంబై శివారులోని భయాందర్ ఈస్ట్  ప్రాంతంలో 3,300 గజాల స్థలం కొనుగోలు చేశారు.  గత  పదిహేనేళ్లుగా ఆ భూమి నిర్మాణ రంగంలో ఉన్న  బీజేపీ  ఎమ్మెల్యే  నరేంద్ర మెహతా  అధీనంలో ఉంది.  2011లో  తాను ఒకరి దగ్గర ఈ స్థలాన్ని కొన్నానని  ఎమ్మెల్యే  చెబుతున్నారు.  

ప్రధాని  మోదీని అస్గర్  కలవడంతో  ఆ భూమిని ఆయన స్వచ్ఛందంగా   వదులుకున్నట్లు  తెలుస్తోంది.  కోట్లు  విలువ చేసే  భూమి విషయంలో  ఆ ఎమ్మెల్యే  వెనక్కి తగ్గడం విచిత్రమే.  దీని వెనుక ప్రధాని సూచన ఉండే ఉంటుంది.  ఈ వార్త బయటికి రావడంతో  ప్రధాని నరేంద్ర మోదీ బాల్య స్నేహానికిచ్చిన విలువ ప్రజల దాకా వచ్చింది.

మోదీ మిత్రుడు అస్గర్‌‌‌‌‌‌‌‌ అలీ  ముస్లిం కావడం..

మాజీ  ప్రధాని  పీ.వీ. నరసింహారావు తన హయాంలో  తమకు ఫలానా విషయంలో  ఎంతో సాయం చేశారని  కరీంనగర్ వాసులు  ఇప్పటికీ  గుర్తుచేసుకుంటారు.  తమ దోస్తులు,  ఆప్తులు ఇబ్బందుల్లో  ఉన్నప్పుడు వారిని చూడలేక  తామున్న  తాహతు మేరకు ఉన్నత హోదాలో ఉన్నవారు ఆదుకోవడం మంచిదే.  అయితే  అవి ప్రధాన వార్తల్లోకి ఎక్కవు.   

 ప్రధాని మోదీని అస్గర్ అలీ కలిసిన విషయం మాత్రం జాతీయ వార్త అయింది.  వారి  కలయిక  ఫొటోలను  పీఎంఓ కూడా  విడుదల  చేసింది.  స్థలాన్ని స్వాధీనం చేసుకున్న బీజేపీ ఎమ్మెల్యే నష్టానికి  సిద్ధపడి భూమిని వదిలేశారు.  ఈ వార్త  బయటికి రావడం వెనుక రాజకీయ ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయనుకుంటే  ప్రధాని మోదీ  గొప్ప మనసున్న మనిషి అనేది ఒకటి కాగా,   అస్గర్  అలీ  ముస్లిం కావడం మరో అంశం.  

ప్రతికూల అంశాల  విషయానికొస్తే నాయకులు బలహీనుల భూములను లాక్కుంటున్నారనేది మరోటి.  మహారాష్ట్రలో  స్థానిక  బీజేపీ  ఎమ్మెల్యేగా ఉన్న నరేంద్ర మెహతా ఒక పౌరుడి  అభ్యర్థనను  పట్టించుకోలేదు.  అస్గర్  స్కూల్ మేట్ మోదీ  ప్రధాని పదవిలో  లేకుంటే ఆయనను కాపాడేవారెవరు అనే ప్రశ్న కూడా వినిపిస్తున్నది. 

నాయకుల పెత్తనం.. సామాన్యులకు ఇబ్బందులు 

ప్రధాని మోదీ  తన మిత్రుడి పిల్లల చదువుకో,   వివాహానికో  సాయం చేస్తే  అది  ఔదార్యం అవుతుంది.  అస్గర్  వివాదం  మాత్రం  దేశంలోని  రాజకీయ నాయకుల పెత్తనాన్ని,  సామాన్యుల ఇబ్బందులను తెలియజేస్తోంది.  మన దేశంలో  ఈ  సమస్య ఒక్క అస్గర్ అలీదే  కాదనే విషయం  ప్రధాని మోదీకి 
తెలియనిది కాదు.  కానీ   ఇప్పడు  మహారాష్ట్ర  రాజకీయాల్లో ఈ సంఘటన  కాంగ్రెస్  పార్టీకి  ఓ విమర్శనాస్త్రమైంది.  

పదిహేనేళ్లుగా  ఒక సామాన్యుడు  తన భూమిని  కాపాడమని  పోలీసు,  రెవెన్యూ, మున్సిపల్ అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోలేదని  మహారాష్ట్ర  కాంగ్రెస్  చీఫ్ నానా పటోలె  విమర్శిస్తున్నారు.   ప్రధానిని  కలిస్తేనే   న్యాయం  దక్కుతుందా..  సామాన్య ప్రజలలో  ప్రధాని
దాకా  చేరేందుకు  ఎందరికి  అవకాశం ఉంటుంది. 

ల్యాండ్ మాఫియాను  ఎదుర్కొనే  శక్తి లేనివారు తమ ఆస్తులు వదిలేసుకోవలసిందేనా? అనే విమర్శ సాగుతోంది.  అయితే,  రాజకీయ కోణంలో  విమర్శలు ఎలా ఉన్నా  ప్రధాని మోదీ,  అస్గర్ అలీల  స్నేహ బంధం జాతీయ స్థాయిలో మంచి సందేశాన్నే ఇచ్చింది.   చిన్ననాటి  మిత్రుడికి  సాయం చేయడం ద్వారా  ప్రధాని  మంచి స్నేహశీలి అనే పేరు వస్తుంది.  

సామాన్యుడు  కూడా ప్రధానిని స్వయంగా కలవవచ్చు అనే భావన ప్రజల్లో కలుగుతుంది. మోదీ దృష్టికి వెళ్లవద్దనే భయం బీజేపీ ప్రజాప్రతినిధులకు  కూడా ఏర్పడవచ్చు. ఎంతో ముందుచూపు లేనిదే  ప్రధాని మోదీ,  తన  చిన్ననాటి మిత్రుడి  కలయికను  వార్తగా రానీయరు. కలిసేవారెందరున్నా వీరిదే బయటకు రావడం వెనుక ఏదో విశేషముంటుంది.

-  బద్రి నర్సన్-

గమనిక: ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ [email protected] రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.రచన 700 పదాలకు మించరాదు.