India vs Bangladesh: ఆసియా గేమ్స్ 2026 మహిళల క్రికెట్ రెండో సెమీఫైనల్లో భారత బ్యాటర్లు రికార్డుల సునామీ సృష్టించారు. జపాన్ గడ్డపై బంగ్లాదేశ్‌తో జరుగుతున్న నాకౌట్ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న టీమిండియా, నిర్ణీత ఓవర్లలో 195 పరుగుల భారీ స్కోరు సాధించింది. యంగ్ క్రికెటర్ షెఫాలీ వర్మ సెంచరీతో విరుచుకుపడగా, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన ఓ అరుదైన ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకుంది.
షెఫాలీ విధ్వంసకర సెంచరీ:
ఓపెనర్ షెఫాలీ వర్మ మైదానంలో బంగ్లాదేశ్ బౌలర్లకు చుక్కలు చూపించింది. క్రీజులోకి వచ్చిన క్షణం నుంచే బౌండరీల వర్షం కురిపించిన షెఫాలీ కేవలం 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. ఆ తర్వాత కూడా ఏమాత్రం తగ్గకుండా బ్యాట్ ఝుళిపించి ఆసియా గేమ్స్ సెమీఫైనల్లో బిగ్ సెంచరీ (Historic Ton) సాధించి భారత స్కోరును 195 పరుగులకు తీసుకెళ్లింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌తో కలిసి వికెట్ పడకుండా మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పింది.
ప్రపంచంలోనే నంబర్ 1గా స్మృతి:
మరోవైపు టీమిండియా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (37 పరుగులు) సరికొత్త చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ మహిళల టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యధిక పరుగులు (Highest Run-Scorer in T20Is) సాధించిన ప్లేయర్ గా స్మృతి మంధాన వరల్డ్ రికార్డు నెలకొల్పింది. న్యూజిలాండ్ దిగ్గజ బ్యాటర్ సూజీ బేట్స్ పేరు మీద ఉన్న ఆల్ టైమ్ రికార్డును స్మృతి ఈ మ్యాచ్‌తో అధిగమించి అగ్రస్థానానికి చేరుకుంది. స్మృతిని నహిదా అక్తర్ పెవిలియన్‌కు పంపగా, గుణాలన్ కమలిని (3)ని సంజీదా అక్తర్ అవుట్ చేసింది.
బంగ్లాదేశ్ ముందు 196 పరుగుల టార్గెట్:
జపాన్‌పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన సేమ్ ప్లేయింగ్ ఎలెవెన్‌తో బరిలోకి దిగిన భారత జట్టు, ఈ మ్యాచ్‌లో తమ పవర్ హిట్టింగ్తో ప్రత్యర్థిని దెబ్బతీసింది. 196 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగనున్న బంగ్లాదేశ్‌ను భారత బౌలర్లు కట్టడి చేస్తే, శ్రీలంకతో ఫైనల్ పోరుకు అర్హత సాధించి కనీసం రజత పతకం ఖాయమవుతుంది.
