తమిళ సీనియర్ సినీ నటి వడివుక్కరసి చనిపోయారనే పుకార్లు సోషల్ మీడియాలో కలకలం రేపాయి. ఈ పుకార్లపై సదరు సీనియర్ సినీ నటి స్వయంగా స్పందించారు. తమిళ ఛానల్ తంతి టీవీతో మాట్లాడుతూ.. తాను నిక్షేపంగా ఉన్నానని, చనిపోలేదని.. బతికే ఉన్నానని చెప్పుకొచ్చారు. తనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా లేవని స్పష్టత ఇచ్చారు.
తన ఆరోగ్యం గురించి కంగారు పడిన వారందరికీ స్పష్టత ఇస్తున్నానని.. తనపై చూపిస్తున్న అభిమానానికి ధన్యవాదాలని ఆమె చెప్పారు. వడివుక్కరసి సీనియర్ సినీ నటి. భారతీయ చలనచిత్రాలతో పాటు టెలివిజన్ రంగంలో కూడా ఆమె ప్రేక్షకుల ఆదరణ పొందారు. ఆమె ప్రధానంగా తమిళ చిత్రసీమతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ సినీ పరిశ్రమల్లో.. బుల్లి తెరపై కూడా మెప్పించారు.
దాదాపు ఐదు దశాబ్దాల సినీ, సీరియల్ కెరీర్ ఆమె సొంతం. 350కి పైగా సినిమాల్లో నటించారు. 40కి పైగా టీవీ సీరియల్స్‌లో కీలక పాత్రలు పోషించి బుల్లి తెర ప్రేక్షకులకు సుపరిచితురాలిగా మారారు. తమిళ్ నుంచి తెలుగులో డబ్బింగ్ అయిన రజినీకాంత్ ‘శివాజీ’ సినిమాలో రజినీకాంత్ తల్లి పాత్ర పోషించారు. కమల్ హాసన్, రజినీకాంత్తో పాటు తమిళ్ టాప్ స్టార్స్ అందరితో ఆమె నటించారు. రజినీకాంత్ అరుణాచలం సినిమాలో ఆమె చేసిన పాత్రకు మంచి గుర్తింపు దక్కింది. ప్రస్తుతం ఆమె వయసు 68 సంవత్సరాలు.
