IND W vs BAN W: ఆసియా గేమ్స్ 2026 మహిళల క్రికెట్ ఈవెంట్‌లో భారత జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లి రజత పతకాన్ని ఖాయం చేసుకుంది. ఈరోజు (సెప్టెంబర్ 20, ఆదివారం) నిషిన్ వేదికగా జరిగిన రెండో సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌ను 114 పరుగుల తేడాతో చిత్తు చేసి టీమిండియా ఘన విజయం సాధించింది. యంగ్ ఓపెనర్ షెఫాలీ వర్మ విధ్వంసకర శతకంతో విరుచుకుపడటంతో ఇండియా పసిడి పతక పోరుకు అర్హత సాధించింది.
49 బంతుల్లో 100 రన్స్ చేసిన షఫాలీ:
మేడిన్ టీ20 సెంచరీ: షెఫాలీ వర్మ బంగ్లాదేశ్ బౌలర్లపై ఏమాత్రం కనికరం చూపకుండా కేవలం 49 బంతుల్లోనే 9 భారీ సిక్సర్లు, 3 ఫోర్లతో 100 పరుగులు (నాటౌట్) చేసి అంతర్జాతీయ టీ20ల్లో తన తొలి సెంచరీని నమోదు చేసింది.
స్మృతి మెరుపులు: స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (37) మెరుపులు మెరిపించగా, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (33 బంతుల్లో 40) బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడింది. దీంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. బంగ్లా బౌలర్లలో సంజీదా అక్తర్ మేఘ్లా (1/25) ఫర్వాలేదనిపించింది.
81 పరుగులకే బంగ్లా ఆలౌట్:
196 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌ను భారత బౌలర్లు తీవ్రంగా దెబ్బతీశారు. భారత బౌలర్ల దాటికి బంగ్లాదేశ్ కేవలం 15.4 ఓవర్లలోనే 81 పరుగులకు కుప్పకూలింది. ఓపెనర్ దిలారా అక్తర్ (23 బంతుల్లో 27) మాత్రమే కాసేపు పోరాడింది. టీమిండియా తరఫున దీప్తి శర్మ (3/7), నందని శర్మ (3/25) చెరో 3 వికెట్లతో విరుచుకుపడగా, శ్రీ చరణి (2/7) 2 వికెట్లు తీసుకుంది.
శ్రీలంకతో ఫైనల్.. గోల్డ్ మెడలే లక్ష్యం:
పాకిస్థాన్‌ను ఓడించి ఫైనల్‌కు చేరిన శ్రీలంకతో భారత మహిళల జట్టు పసిడి పతకం (Gold Medal) కోసం తలపడనుంది. షెఫాలీ వర్మ ఫామ్‌లో ఉండటం, బౌలర్లు కూడా తిరుగులేని ప్రదర్శన చేస్తుండటంతో ఆసియా గేమ్స్‌లో భారత్ స్వర్ణం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.
