నోటీస్ ఇస్తే ఓటు తీసేసినట్టు కాదు: ఓటర్ల జాబితా సవరణ వివాదంపై ఈసీ క్లారిటీ

నోటీస్ ఇస్తే ఓటు తీసేసినట్టు కాదు: ఓటర్ల జాబితా సవరణ వివాదంపై ఈసీ క్లారిటీ

న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో భాగంగా ఓటర్లకు నోటీసులు ఇచ్చినంత మాత్రాన వారిని ఓటర్ల జాబితా నుండి తొలగించినట్లు కాదని కేంద్ర ఎన్నికల సంఘం (EC) స్పష్టం చేసింది. ఢిల్లీలో కొనసాగుతున్న సర్ ప్రక్రియలో భాగంగా సీఎం రేఖాగుప్తా, కేంద్ర మంత్రి జైశంకర్, బీజేపీ సీనియర్ నేత ఎల్‎కే అద్వానీ, సీబీఐ డైరెక్టర్, మాజీ సీఎం కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది సహా పలువురు ప్రముఖులకు సర్ నోటీసులు జారీ చేశారు. 

వీరికి నోటీసులు ఇవ్వడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బీజేపీ, ఈసీ కుమ్మక్కై ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేసి వారి ఓట్ల తొలగించే కుట్రలో భాగంగానే సర్ పేరుతో నోటీసులు ఇస్తున్నారని విపక్షాలు ఆరోపించాయి. హై ప్రొఫెల్ వ్యక్తులకు సర్ నోటీసుల అంశం బీజేపీ, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ వివాదంపై కేంద్ర ఎన్నికల వివరణ ఇచ్చింది. 

సర్ ప్రక్రియలో భాగంగా నోటీసులు ఇవ్వడం అంటే ఓటర్ల జాబితా నుంచి పేర్లను తొలగించడం లేదా ఎవరినీ బహిష్కరించడం కాదని స్పష్టం చేసింది. గత ఓటర్ జాబితా లేదా ఎన్యుమరేషన్ ఫారమ్‌లలో వివరాలు అసంపూర్తిగా ఉండటం లేదా ప్రస్తుత రికార్డులతో సరిపోలకపోవడం వల్ల నోటీసులు జారీ చేస్తున్నట్లు వివరణ ఇచ్చింది. 

సరైన పత్రాలు లేదా సమాచారం అందించాల్సిందిగా ఓటర్లను కోరడమే నోటీసుల జారీ ప్రధాన ఉద్దేశమని తెలిపింది. ఓటర్ జాబితాలో వివరాలు సరిగ్గా లేకపోతే ఎవరికైనా నోటీసులు ఇస్తున్నామని.. ఇందులో ఎవరికి మినహాయింపు లేదని స్పష్టం చేసింది. వీవీఐపీలకు కూడా నోటీసులు ఇవ్వడం సర్ ప్రక్రియ ఎంత పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరుగుతుందనే దానికి నిదర్శమని పేర్కొంది.