మంజీరా ఫేజ్–2లో భారీ లీకేజీ.. హైదరాబాద్లోని ఈ ఏరియాల్లో ఉండే పబ్లిక్ నీళ్లు పొదుపుగా వాడుకోకపోతే కష్టమే !

మంజీరా ఫేజ్–2లో భారీ లీకేజీ.. హైదరాబాద్లోని ఈ ఏరియాల్లో ఉండే పబ్లిక్ నీళ్లు పొదుపుగా వాడుకోకపోతే కష్టమే !

హైదరాబాద్: మంజీరా ఫేజ్–2లో భారీ లీకేజీ కారణంగా హైదరాబాద్ సిటీ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. బీరంగూడ కమాన్ వద్ద 1500 ఎంఎం వ్యాసం గల పైప్‌లైన్‌ లీకేజీ అయింది. పటాన్‌చెరు–హైదర్‌నగర్ పంపింగ్ మెయిన్ పైప్‌లైన్‌లో భారీ లీకేజీ కావడంతో లీకేజీ నివారణకు జలమండలి అత్యవసర మరమ్మతు పనులు చేసింది.

ఈ మరమ్మతు పనులను జలమండలి ఎండీ అశోక్ రెడ్డి పరిశీలించారు. యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు పూర్తి చేయాలని అధికారులకు ఎండీ ఆదేశించారు. ఓ అండ్ ఎం, ట్రాన్స్‌మిషన్ అధికారుల సమన్వయంతో పనులు చేస్తున్నారు. మరమ్మతులు పూర్తయ్యాక దశలవారీగా తాగునీటి సరఫరాను పునరుద్ధరిస్తామని అధికారులు చెప్పారు.

RC పురం, అశోక్‌నగర్, జ్యోతినగర్, లింగంపల్లిలో సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చందానగర్, గంగారం, మదీనాగూడ, మియాపూర్ ప్రాంతాల్లోనూ నీటి ఇబ్బందులు తప్పలేదు. బీరంగూడ, అమీన్‌పూర్, భాగ్యనగర్ కాలనీ, ఎర్రగడ్డలోనూ అంతరాయం ఉంది.

ఎస్.ఆర్.నగర్, అమీర్‌పేట్ ప్రాంతాలకు తాగునీటి సరఫరాపై ఈ పైప్ లైన్ లీకేజ్ ప్రభావం పడింది. కేపీహెచ్‌బీ కాలనీ, కూకట్‌పల్లి, ప్రగతినగర్‌కు కూడా తాగు నీటి సరఫరాలో అంతరాయం కలిగింది. ప్రభావిత ప్రాంతాల ప్రజలు నీటిని పొదుపుగా వినియోగించాలని జలమండలి విజ్ఞప్తి చేసింది.