బ్యాంక్ అకౌంట్, మ్యూచువల్ ఫండ్‌లో నామినీ ఉన్నాడని డబ్బు అతనిదే అనుకుంటున్నారా? అసలు నిజం ఇదే!

బ్యాంక్ అకౌంట్, మ్యూచువల్ ఫండ్‌లో నామినీ ఉన్నాడని డబ్బు అతనిదే అనుకుంటున్నారా? అసలు నిజం ఇదే!

చాలామంది బ్యాంక్ అకౌంట్, మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ పాలసీల్లో నామినీగా పేరు పెట్టిన వ్యక్తికే ఆ డబ్బు పూర్తిగా చెందుతుందని అనుకుంటుంటారు. కానీ ఇది సాధారణంగా కనిపించే ఒక పెద్ద అపోహని న్యాయ నిపుణులు చెబుతున్నారు. నామినీ పాత్ర ప్రధానంగా ఆర్థిక సంస్థల నుంచి డబ్బును స్వీకరించి, ఆస్తుల బదిలీ ప్రక్రియను సులభతరం చేయడం మాత్రమే. నామినీకి డబ్బు అందినంత మాత్రాన వాళ్లే ఆ ఆస్తికి చట్టపరమైన యజమాని అవ్వరని గుర్తుంచుకోండి.

విల్ ఉంటే దాని ప్రకారమే ఆస్తుల పంపకం
ఒక వ్యక్తి మరణించిన తర్వాత అతను రాసిన చెల్లుబాటు అయ్యే వీలునామా ఉంటే.. ఆస్తులు అందులో పేర్కొన్న విధంగానే పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి తన మ్యూచువల్ ఫండ్‌కు సోదరుడిని నామినీగా నియమించుకున్నా.. తన వీలునామాలో ఆ పెట్టుబడులన్నీ భార్యకు చెందాలని రాసి ఉంటే, చట్టపరంగా భార్యకే ఆస్తిపై బలమైన హక్కు ఉంటుంది. నామినీ కేవలం ఆ డబ్బును పొందడానికి, తర్వాత అసలు వారసులకు అందించడానికి మధ్యవర్తి పాత్ర పోషించాలి.

వీలునామా లేకపోతే..
ఒక వ్యక్తి ఎలాంటి వీలునామా రాయకుండా మరణిస్తే.. అతని ఆస్తుల పంపకం.. వారసత్వ చట్టాల ప్రకారం జరుగుతుంది. ఈ పరిస్థితిలో చట్టబద్ధమైన వారసులు డబ్బును పొందేందుకు కొన్ని డాక్యుమెంట్స్ సమర్పించాల్సి ఉంటుంది. సాధారణంగా డెత్ సర్టిఫికెట్, లీగల్ హెయిర్ సర్టిఫికెట్, సక్సెషన్ సర్టిఫికెట్, గుర్తింపు పత్రాలు వంటి ఆధారాలు అవసరం కావచ్చు. ముఖ్యంగా కుటుంబంలో ఎక్కువ మంది వారసులు ఉన్నప్పుడు లేదా నామినీ లేకపోతే ప్రక్రియ ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది.

నామినీ పెట్టడం ఎందుకు ముఖ్యం?
నామినీకి యాజమాన్య హక్కు లేకపోయినా.. నామినేషన్ చేయడం చాలా ముఖ్యమైన ఆర్థిక ప్రణాళికలో భాగం. నామినీ ఉంటే బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్ సంస్థలు, ఇతర ఆర్థిక సంస్థలు క్లెయిమ్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయగలవు. నామినీ లేకపోతే కుటుంబ సభ్యులు ఎక్కువ డాక్యుమెంట్స్ సమర్పించాల్సి రావడంతో డబ్బు పొందే ప్రక్రియ ఆలస్యం కావచ్చు.

ALSO READ : అప్పులు చేసినోళ్లకు గుడ్ న్యూస్

జీవితంలో ముఖ్యమైన మార్పులు జరిగినప్పుడు నామినేషన్ వివరాలను తప్పనిసరిగా మార్చుకోవాలని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు. ఉదాహరణకు పెళ్లి, విడాకులు, పిల్లలు పుట్టడం వంటి సందర్భాల్లో నామినీ వివరాలను పరిశీలించాలి. అలాగే నామినేషన్‌లో ఉన్న వ్యక్తి, వీలునామాలో పేర్కొన్న వారసులు ఒకే విధంగా ఉండేలా చూసుకోవడం మంచిది. సరైన నామినేషన్‌తో పాటు చట్టబద్ధమైన వీలునామా ఉంటే భవిష్యత్తులో కుటుంబ వివాదాలు తగ్గి.. మీరు కోరుకున్న విధంగానే ఆస్తులు సరైన వ్యక్తులకు చేరుతాయి.