న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లును మరోసారి పార్లమెంట్ ముందుకు తీసుకొచ్చేందుకు మోడీ సర్కార్ ప్రణాళికలు రచిస్తోంది. ఈ తరుణంలో తమిళనాడు ప్రతిపక్ష పార్టీ డీఎంకే డీలిమిటేషన్ బిల్లుపై తమ వైఖరిని స్పష్టం చేసింది. కేంద్రం ప్రతిపాదిస్తోన్న తాజా డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. డీలిమిటేషన్ బిల్లుపై తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని పునరుద్ఘాటించింది. డీలిమిటేషన్ బిల్లుపై చర్చించేందుకు తమిళనాడు రాజ్య సభ, లోక్ సభ ఎంపీలతో ఆగస్ట్ 8న సీఎం విజయ్ విజయ్ భేటీకి పిలుపునిచ్చారు. ఈ భేటీకి ముందు రోజే డీలిమిటేషన్ బిల్లుపై తమ వైఖరిని స్పష్టం చేసింది.
ఈ సందర్భంగా డీఎం యువనేత, తమిళనాడు అపొజిషన్ లీడర్ ఉదయనిధి స్టాలిన్ శుక్రవారం (ఆగస్ట్ 7) జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. డీఎంకే ఎల్లప్పుడూ నియోజకవర్గాల పునర్విభజనను వ్యతిరేకిస్తూనే ఉంది.. భవిష్యత్తులో కూడా దానిని వ్యతిరేకిస్తూనే ఉంటుందని తమ స్టాండ్ ప్రకటించారు. ఇది కొత్త సమస్య కాదని.. ఈ బిల్లును మొదటిసారిగా తెరపైకి వచ్చినట్లుగా కేంద్రం చిత్రీకరిస్తోందని విమర్శించారు. డీలిమిటేషన్ బిల్లులో మూడు మార్పులు చేస్తే డీఎంకే మద్దతు ఇచ్చే అవకాశం ఉందని నేషనల్ మీడియాలో కథనాలు వెలువడటంతో డీఎంకే ఈ మేరకు వివరణ ఇచ్చింది.
ఇండీ కూటమి నుంచి డీఎంకే ఔట్:
2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండీ కూటమిలో చీలిక తెచ్చాయి. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్, డీఎంకే కూటమి ఓటమి పాలైంది. విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ఘన విజయం సాధించింది. కాకపోతే ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ రాకపోవడంతో టీవీకేకు కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది. కాంగ్రెస్ చర్యతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన డీఎంకే.. జాతీయ స్థాయిలో ఇండీ కూటమి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది.
ALSO READ : రోడ్డును ఆరపెట్టడానికి ఫ్యాన్స్ పెట్టడం ఏంట్రా బాబు..
ఇండీ కూటమిలో భాగస్వామిగా ఉన్నప్పుడు డీలిమిటేషన్ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించిన డీఎంకే.. కూటమి నుంచి వైదొలిగిన తర్వాత దాని నిర్ణయంపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే కేంద్రం ప్రతిపాదించిన డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు ఇచ్చే అవకాశం ఉందంటూ నేషనల్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. దీంతో రంగంలోకి దిగిన డీఎంకే డీలిమిటేషన్ బిల్లుపై తమ వైఖరిని పునరుద్ధాటించింది.
