- ‘మహాలక్ష్మి’తో ఆర్డినరీ, ఎక్స్ప్రెస్బస్సులు ఫుల్లు
- 80 శాతం మహిళలదే ఆక్యుపెన్సీ
- నిలబడి కూడా వెళ్లలేకపోతున్న పురుష ప్రయాణికులు
- కొత్త బస్సులతో కాస్త ఈజీ కానున్న ప్రయాణం
హైదరాబాద్ సిటీ, వెలుగు: మహానగరంలోని ఆర్డీసీ ఆర్డినరీ, ఎక్స్ప్రెస్బస్సుల్లో మహాలక్ష్మి పథకంతో మహిళలు ఎక్కువగా ప్రయాణిస్తున్నారు. దాదాపు ప్రతి బస్సులో 80 శాతం ఆక్యుపెన్సీ వారిదే ఉంటున్నది. రద్దీ పెరగడంతో పురుషులు నిలబడడానికి కూడా జాగా లేక తిప్పలు పడుతున్నారు.
కొన్ని సార్లు కనీసం బస్సు ఎక్కడానికి కూడా వీలులేకుండా పోతున్నది. దీంతో డబ్బులు కాస్త ఎక్కువైనా మెట్రో డీలక్స్ బస్సుల్లో అయినా వెళ్దామనుకుంటే సరిపడా బస్సుల్లేక అందులోనూ నిలబడి వెళ్లాల్సి వస్తున్నది. వీరి కష్టాలను గుర్తించిన ఆర్టీసీ.. మగ ప్రయాణికుల కష్టాలు తీర్చేందుకు కొత్తగా 75 మెట్రో డీలక్స్బస్సులు తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది.
మెట్రో డీలక్స్‌లకు పెరుగుతున్న డిమాండ్
ప్రస్తుతం గ్రేటర్లో 3,200 బస్సులుండగా, ఇందులో మెట్రో డీలక్స్ బస్సులు 275 మాత్రమే ఉన్నాయి. మెట్రో ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీ బస్సులు పెద్ద సంఖ్యలో ఉండగా, వీటిని ఎక్కువగా మహిళలే ఉపయోగించుకుంటున్నారు. దీంతో పురుష ప్రయాణికులు మెట్రోరైల్, ఎంఎంటీఎస్, క్యాబ్, ఆటోల వైపు మొగ్గుచూపుతున్నారు.
దీని వల్ల ఆర్టీసీకి ఆదాయం కూడా తగ్గిపోతోంది. ఇప్పటికే సిటీలో తిరుగుతున్న మెట్రోడీలక్స్ బస్సులు కూడా కిక్కిరిసిపోతుండడంతో మరో 75 మెట్రోడీలక్స్ బస్సులను ప్రవేశపెట్టబోతున్నారు. ఇందులో మహాలక్ష్మి పథకం వర్తించదని, టికెట్ కొనేవారు, బస్ పాస్‌లు ఉన్నవారే ప్రయాణం చేయవచ్చని ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు. కొన్ని నెలలు చూశాక ఈ బస్సులు కూడా సరిపోనట్టయితే మరికొన్ని బస్సులను అందుబాటులోకి తీసుకు వస్తామని అంటున్నారు.
45 లాంగ్ రూట్లలో ఈ సర్వీసులు
ప్రస్తుతం సిటీలోని 26 డిపోల పరిధిలో నడుస్తున్న 275 మెట్రో డీలక్స్బస్సులను లాంగ్రూట్స్కు విస్తరించాలని అధికారులు భావిస్తు న్నారు. లాంగ్రూట్స్లో బస్సులు నడపడం వల్ల ప్రయాణికులు గడికోసారి బస్సులు మారాల్సిన అవసరం ఉండదంటు న్నారు. మెహిదీపట్నం– శంషాబాద్, సీబీఎస్–శంకర్పల్లి, సికింద్రాబాద్–రామాయం పేట, మేడ్చల్– కోకాపేట, హయత్ నగర్–జేబీఎస్, దిల్సుఖ్ నగర్–చౌటుప్పల్, మెహిదీపట్నం– చిలుకూరు బాలాజీ టెంపుల్, ఉప్పల్–మెహిదీపట్నం, పటాన్చెరు–కోఠి, చర్లపల్లి–పటాన్చెరు, సికింద్రాబాద్–ఇబ్రహీపట్నం, సీబీఎస్–గండిమైసమ్మ, సికింద్రాబాద్–చర్ల పల్లి, జేబీఎస్–ఇబ్రహీంపట్నం, సికింద్రాబాద్–మణికొండ, ఉప్పల్–పటాన్చెరు తదితర మొత్తం 45 లాంగ్రూట్స్లో మెట్రో డీలక్స్ బస్సులు నడపనున్నట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఉన్న బస్సులతో పాటు అదనంగా 75 బస్సులను ప్రవేశపెట్టడం వల్ల ట్రిప్పుల సంఖ్య పెరుగుతుందని, ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులు అందుబాటులో ఉంటాయంటున్నారు.
