నీళ్లున్నా..గండమే!..ముందు జాగ్రత్తగా ధర్మసాగర్ రిజర్వాయర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ మెయింటైన్ కు ఆఫీసర్ల ప్లాన్ 

నీళ్లున్నా..గండమే!..ముందు జాగ్రత్తగా ధర్మసాగర్ రిజర్వాయర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ మెయింటైన్ కు ఆఫీసర్ల ప్లాన్ 
  • ఎల్ నినో ఎఫెక్ట్ తో తాగునీటికి ముప్పు    
  • క్షేత్రస్థాయి సమస్యలతో తాగునీటి సరఫరాలో ఇబ్బందులు
  • ఒక్కో డివిజన్ లో పదుల సంఖ్యలో లీకేజీలు
  • వృథా అరికడితేనే ముప్పు తప్పే అవకాశం

హనుమకొండ, వెలుగు:  ఎల్ నినో ఎఫెక్ట్ తాగునీటి సరఫరాపై పడకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. వర్షాలు లేక ఎండిపోతున్న జలాశయాలను దేవాదుల నీటితో నింపుతోంది. వర్షాకాలం ముగింపు దశకు వచ్చినా చెప్పుకోదగ్గ వానలు లేకపోవడం, ఇంకా ఎండల తీవ్రత కొనసాగుతుండడంతో తాగునీటి సరఫరాకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం ఆఫీసర్లకు ఆదేశాలిచ్చింది. దీంతో గ్రేటర్ వరంగల్ కు తాగునీటి సమస్య తలెత్తకుండా దేవాదుల ఆఫీసర్లు గోదావరి నీటిని లిఫ్ట్ చేసి ధర్మసాగర్ రిజర్వాయర్ ను నింపుతున్నారు.

అయితే ధర్మసాగర్ రిజర్వాయర్ నిండా నీళ్లున్నా క్షేత్రస్థాయి సమస్యలతో డ్రింకింగ్ వాటర్ సప్లైకి అడ్డంకులు ఏర్పడుతున్నాయి. గ్రేటర్ పరిధిలోని పలు డివిజన్లలో చాలాచోట్ల లీకేజీలు కలవరపెడుతున్నాయి. ఓల్డ్ పైపులైన్లు, లీకేజీల కారణంగా నిత్యం లక్షలాది లీటర్ల నీళ్లు నేలపాలవుతుండగా, మళ్లీ వానాకాలం దాకా వరంగల్ నగరానికి తాగునీటి గండం తప్పేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ధర్మసాగర్ నిండుగా దేవాదుల నీళ్లు..

గ్రేటర్ వరంగల్ నగరానికి ధర్మసాగర్ రిజర్వాయర్ నుంచి వచ్చే నీళ్లే ఆధారం. గోదావరి నుంచి దేవాదుల పంపులతో ధర్మసాగర్ రిజర్వాయర్ లోకి లిఫ్ట్ చేస్తున్న నీటిని ధర్మసాగర్, వడ్డేపల్లి, కేయూ, దేశాయిపేటలోని ఫిల్టర్ బెడ్లలో శుద్ధి చేసి నగరంలోని చేస్తుంటారు. ఈసారి ఎల్ నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా సరిపడా వానలు లేక సాగు, తాగునీటికి ఇబ్బందులు తలెత్తే అవకాశం కనిపిస్తోంది.

ఈ నేపథ్యంలోనే సాగు, తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాల్సిందిగా ప్రభుత్వం ఆఫీసర్లకు ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఇరిగేషన్ ఆఫీసర్లు గోదావరిపై ములుగు జిల్లా గంగారం వద్ద నిర్మించిన ఇన్ టెక్ పాయింట్ నుంచి నీటిని ఎత్తిపోస్తూ ధర్మసాగర్ రిజర్వాయర్ ను నింపుతున్నారు. రిజర్వాయర్ ఫుల్ కెపాసిటీ 1.5 టీఎంసీలు కాగా, ఇప్పటికే 1.15 టీఎంసీల నీటిని అందులోకి లిఫ్ట్ చేశారు. ఇక్కడి నుంచి సౌత్, నార్త్ మెయిన్ కెనాళ్ల ద్వారా సాగునీటిని విడుదల చేయడంతో పాటు వరంగల్ నగరానికి తాగునీటిని సప్లై 
చేస్తున్నారు.

పాత లైన్లతోనూ తిప్పలే..

జీడబ్ల్యూఎంసీ పరిధిలో ప్రజలకు తాగునీటిని అందించేందుకు దాదాపు 125 వాటర్ ట్యాంకులు, 200 కిలోమీటర్లకుపైగా ఫీడర్ మెయిన్స్, 3 వేల కిలోమీటర్లపైగా డిస్ట్రిబ్యూటరీ పైపులైన్లు ఉన్నాయి. కానీ, ఇందులో అర్బన్ మిషన్ భగీరథ కింద వేసిన లైన్లు మినహా మిగతావన్నీ 1982లో వేసివే. దశాబ్దాల కింద వేసిన లైన్లు కావడంతో అవి శిథిలమైపోగా, వాటర్ ప్రెజర్ తట్టుకోలేక తరచూ లీకేజీలు ఏర్పడుతున్నాయి. రిపేర్లు చేసినా మళ్లీ అదే పరిస్థితి తలెత్తుతోంది.

దీంతో కొన్నిచోట్ల రెండు, మూడు నెలలకోసారైనా లీకేజీల పేరుతో రోడ్లు తవ్వాల్సి వస్తోంది. గ్రేటర్ ఆఫీసర్లు తాగునీటి వృథాకు చెక్ పెడితేనే ఎల్ నినో గండం నుంచి బయటపడే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ దిశగా జీడబ్ల్యూఎంసీ ఆఫీసర్లు లీకేజీలు, ఇతర సమస్యలపై దృష్టి పెట్టాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

లీకేజీలే ప్రధాన సమస్య..

గ్రేటర్ వరంగల్ పరిధిలోని 66 డివిజన్లలో దాదాపు 2.5 లక్షల ఇండ్లు ఉండగా, 11 లక్షలకుపైగా జనాభా నివసిస్తోంది. నగర పరిధిలోని ఫిల్టర్ బెడ్ ల ద్వారా ప్రతిరోజు 172.3 మిలియన్ లీటర్ (ఎంఎల్డీ) నీటిని ఇండ్లకు సరఫరా చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో లీకేజీల కారణంగా చాలాచోట్ల నీళ్లు వృథాగా పోతోంది. నగరంలో 66 డివిజన్లు ఉండగా, వాటి పరిధిలో కనీసం 500 వరకు లీకేజీలు ఉంటాయని క్షేత్రస్థాయి సిబ్బంది అంచనా వేస్తున్నారు.

ఇలా లీకేజీల కారణంగా ప్రతిరోజు 40 ఎంఎల్ డీల వరకు నీళ్లు వృథాగా పోతున్నాయని చెబుతున్నారు. వరంగల్ నగరంలో లీకేజీల బెడద వేధిస్తున్న నేపథ్యంలో దాదాపు నాలుగేండ్ల కింద హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డుకు సంబంధించిన ఆఫీసర్లతో వరంగల్ లో తాగునీటి వ్యవస్థ, లోపాలపై స్టడీ చేయించారు. ఇక్కడ కూడా ప్రత్యేకంగా వాటర్ బోర్డు ఏర్పాటుకు చర్యలు చేపట్టనున్నట్లు చెప్పారు. కానీ ఆ త్వరాత విషయాన్ని గాలికొదిలేశారు. ఫలితంగా క్షేత్రస్థాయిలో లీకేజీల కారణంగా లక్షలాది లీటర్ల నీళ్లు నిత్యం నేలపాలవుతుండటం గమనార్హం.