న్యూఢిల్లీ: ముడి పదార్థాల ఖర్చులు పెరగడం, వర్షాకాలం తర్వాత డిమాండ్ పుంజుకోవడంతో స్టీల్ధరలు నాలుగేళ్ల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. మార్కెట్ రీసెర్చ్ సంస్థ బిగ్‌మింట్ నివేదిక ప్రకారం.. ధరల పెరుగుదల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మిగిలిన త్రైమాసికాల్లోనూ కొనసాగవచ్చు. దీని తయారీలో వాడే హాట్ రోల్డ్ కాయిల్ టన్ను ధర రూ.64 వేల వద్ద, కోల్డ్ రోల్డ్ కాయిల్ టన్ను ధర రూ.75 వేల వద్ద ట్రేడవుతున్నాయి. ఈ ఏడాది ఆగస్టు ప్రారంభం నుంచి వీటి ధరలు భారీగా పెరిగాయి.
దిగుమతి చేసుకునే కోకింగ్ కోల్ ధర ఒక నెలలోనే విపరీతంగా ఎగిసింది. ఉక్కు తయారీ ఖర్చులో కోకింగ్ కోల్ వాటా 30 శాతానికి పైగా ఉంటుంది. భారత్‌లో ఉక్కు వినియోగం ఏడు శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసింది. నిర్మాణం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాలు దేశంలో ఉత్పత్తి అయ్యే ఉక్కులో 60 శాతం వినియోగిస్తాయి కాబట్టి రాబోయే రోజుల్లో ధరలు తగ్గే అవకాశం లేదని విశ్లేషకులు స్పష్టం చేశారు. కేంద్రం కూడా ఇన్ఫ్రాపై భారీగా ఖర్చు చేస్తున్నందున ఉక్కు వాడకం పెరుగుతోంది.
