ప్లాస్టిక్ వద్దు.. స్టీల్ ముద్దు.. ఇది ప్రతి పౌరుడి బాధ్యత

ప్లాస్టిక్ వద్దు.. స్టీల్  ముద్దు.. ఇది ప్రతి పౌరుడి బాధ్యత

ఒక పెళ్లి ముగిసింది.  వందల పళ్లాలు, గ్లాసులు చెత్తకుప్పలో చేరాయి.  విందు కొన్ని గంటల్లో ముగిసినా, ఆ ప్లాస్టిక్ వ్యర్థం మాత్రం ప్రకృతిపై దీర్ఘకాల భారంగా మిగులుతుంది. సౌకర్యం కోసం ఎంచుకున్న ‘వాడి పారేయడం’ సంస్కృతి ఇప్పుడు చెత్త సమస్యగా మన ముందుంది.  దీనికి పరిష్కారం కేవలం నిషేధం కాదు.

 పారేయకుండా తిరిగి ఉపయోగించే అలవాటుకు వ్యవస్థను జోడించడం. ఇక్కడే గ్రామపంచాయతీల్లో ఎన్నికైన యువ సర్పంచ్‌‌‌‌ల నాయకత్వం కీలకమవుతుంది. ప్రతి పంచాయతీ తన జనాభాకు అనుగుణంగా స్టీల్ పళ్లాలు, గ్లాసులు కొనుగోలు చేసి, వాటిని పంచాయతీ ఆస్తిగా నమోదు చేయాలి. 

300 కుటుంబాలున్న  గ్రామానికి అవసరమైనన్ని,  వెయ్యి కుటుంబాలున్న  గ్రామానికి  తగినన్ని సమకూర్చాలి. పెళ్లిళ్లు, అన్నదానాలు, జాతరలు, పాఠశాల కార్యక్రమాలు, గ్రామసభలు, ఇతర సామూహిక వేడుకలకు వాటిని అందుబాటులో ఉంచాలి. ఒక గ్రామం ప్రారంభించిన విధానాన్ని పక్క గ్రామాలు అనుసరించేలా చేయాలి. ఒక సర్పంచ్‌‌‌‌ నిర్ణయం మరో గ్రామానికి ఆదర్శంగా నిలవాలి. 

స్టీల్ బ్యాంకులు

ఇది కొత్త ఆలోచన కాదు. తెలంగాణలో ఇప్పటికే దీనికి విజయవంతమైన నమూనాలు ఉన్నాయి. సిద్దిపేటలో గ్రామపంచాయతీల స్థాయిలో స్టీల్ బ్యాంకులు ఏర్పాటు చేసి, ఒకసారి వాడే ప్లాస్టిక్‌‌‌‌కు ప్రత్యామ్నాయం చూపించారు. మహిళా సంఘాల భాగస్వామ్యంతో పాత్రల నిర్వహణ కూడా చేపట్టారు. టూప్రాన్‌‌‌‌లో 1,500 స్టీల్ పళ్లాలు, 2,000 గ్లాసులతో ఏర్పాటైన స్టీల్ బ్యాంకు వందలాది కార్యక్రమాల్లో దాదాపు లక్ష ప్లాస్టిక్ పళ్లాలు, గ్లాసుల వినియోగాన్ని నివారించినట్లు నమోదైంది. 

ఖమ్మంలోనూ మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఇలాంటి ప్రయత్నాలు జరిగాయి.  ప్రజల భాగస్వామ్యం దానికి బలం. ప్రతి కుటుంబం ఒక స్టీల్ పళ్లెం, ఒక గ్లాసు ఇవ్వొచ్చు. యువజన సంఘాలు సామగ్రి సమకూర్చవచ్చు. వ్యాపారులు, దాతలు, పూర్వ విద్యార్థుల సంఘాలు సహకరించవచ్చు. ఇళ్లలో ఉపయోగం లేకుండా ఉన్న స్టీల్ సామగ్రి  గ్రామ బ్యాంకుకు చేరితే, అది వ్యక్తిగత వస్తువుగా కాకుండా సామూహిక ఆస్తిగా మారుతుంది. ‘నా పళ్లెం కూడా ఇందులో ఉంది’ అనే భావన ఏర్పడితే, దాన్ని కాపాడే బాధ్యత కూడా పెరుగుతుంది.

పర్యావరణ పరిరక్షణతో పాటు ఉపాధి 

స్టీల్‌‌‌‌ బ్యాంక్‌‌‌‌ నిర్వహణ వల్ల పర్యావరణ పరిరక్షణతోపాటు ఉపాధి అవకాశాలూ ఏర్పడతాయి. తక్కువ అద్దె లేదా నిర్వహణ రుసుముతో సేవలు అందించవచ్చు. వచ్చిన ఆదాయంతో పాడైన పాత్రలను మార్చుకోవచ్చు. ప్రతి పంచాయతీ రిజిస్టర్‌‌‌‌ నిర్వహించి, ఎన్ని పళ్లాలు, గ్లాసులు ఉన్నాయో, ఎవరికి ఇచ్చారో, ఎప్పుడు తిరిగి వచ్చాయో నమోదు చేయాలి. 

 స్టీల్ బ్యాంకు అంటే పాత్రలు నిల్వ చేసే గది కాదు.  బాధ్యతతో నడిచే ప్రజా వ్యవస్థ. ఈ విధానం పెళ్లిళ్లకే పరిమితం కాకూడదు. జాతరలు, అన్నదానాలు, ప్రభుత్వ కార్యక్రమాలు, పాఠశాల వేడుకలు, గ్రామసభలు,  ఎక్కడ  సామూహిక భోజనం ఉంటే అక్కడ స్టీల్‌‌‌‌ పళ్లాలకు చోటుండాలి. దేవాలయాలు, ఫంక్షన్‌‌‌‌ హాళ్లు, భోజనశాలలతో పంచాయతీలు సమన్వయం చేసుకోవచ్చు. పెద్ద కార్యక్రమాల నిర్వాహకులకు ముందుగానే స్టీల్ బ్యాంకు అందుబాటులో ఉందని తెలియజేయాలి. ప్రత్యామ్నాయం చేతిలో ఉంటే నిషేధాన్ని అమలు చేయడం కూడా సులభమవుతుంది. 

గుర్తించిన కొన్ని ఒకసారి వాడే ప్లాస్టిక్ వస్తువులపై ప్రభుత్వ నిషేధం అమల్లో ఉంది. అయితే చట్టం ఒక వైపు, ప్రజల అలవాటు మరో వైపు. అలవాటు మారాలంటే ప్రత్యామ్నాయం అందుబాటులో ఉండాలి. అందుకే ప్రతి గ్రామపంచాయతీ తన వార్షిక ప్రణాళికలో స్టీల్ బ్యాంకును పర్యావరణ చర్యగా మాత్రమే కాకుండా గ్రామ ఆస్తి నిర్మాణ కార్యక్రమంగా చేర్చాలి.  ఒక్కసారి వాడి పారేసే వస్తువు మన సౌకర్యాన్ని మాత్రమే చూస్తుంది.  మళ్లీ మళ్లీ ఉపయోగించే స్టీల్ పళ్లెం మాత్రం మన తర్వాతి తరాన్ని కూడా గుర్తు చేస్తుంది. 


 
- శ్రీశైలం దూడం
ఫ్రీలాన్స్ జర్నలిస్ట్​ 

ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ 
[email protected]
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని 
హామీ తప్పనిసరి రాయాలి. 
స్వీయ రచన అయి ఉండాలి.
 రచన 700 పదాలకు మించరాదు.