- సర్కారీ కాలేజీల్లో1,838, ప్రైవేటు, డీమ్డ్ కాలేజీల్లో 2,579 సీట్లు ఖరారు
- 501 సీట్లతో ఉస్మానియా టాప్.. గాంధీకి 228, వరంగల్ కేఎంసీకి 192 సీట్లు
- త్వరలో సూపర్ స్పెషాలిటీ సీట్లు ప్రకటించనున్నట్లు వెల్లడి
హైదరాబాద్, వెలుగు: దేశవ్యాప్తంగా పీజీ బ్రాడ్ స్పెషాలిటీ కోర్సుల (ఎండీ, ఎమ్మెస్) సీట్ మ్యాట్రిక్స్ ను నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) శుక్రవారం రిలీజ్ చేసింది. మెడికల్ అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డు (ఎంఏఆర్బీ) ఆమోదించిన సీట్లు, కొత్తగా పెరిగిన సీట్లతో కలిపి 68,305 పీజీ బ్రాడ్ స్పెషాలిటీ సీట్లను ఖరారు చేసింది. ఇందులో రాష్ట్రానికి ప్రభుత్వ, ప్రైవేటు, డీమ్డ్ వైద్య విద్యాసంస్థల పరిధిలో కలిపి 4,417 సీట్లు దక్కాయి. ఎంబీబీఎస్ పూర్తియిన తర్వాత ప్రవేశం పొందే ఎండీ, ఎంఎస్, పీజీ డిప్లొమా లాంటి బ్రాడ్ స్పెషాలిటీ సీట్లనే ప్రకటించామని, సూపర్ స్పెషాలిటీ (డీఎం, ఎంసీహెచ్) కోర్సుల సీట్ల వివరాలను తదుపరి విడతలో ప్రకటిస్తామని కమిషన్ స్పష్టం చేసింది.
501 సీట్లతో ఉస్మానియా టాప్
రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, నిమ్స్, ఈఎస్ఐసీ పరిధిలోని 25 సంస్థల్లో మొత్తం 1,838 పీజీ సీట్లు ఖరారయ్యాయి. ఉస్మానియా మెడికల్ కాలేజీ 501 సీట్లతో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీకి 228 సీట్లు, వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీకి 192 సీట్లు మంజూరయ్యాయి. నిమ్స్ సంస్థకు 107 సీట్లు, సనత్నగర్ ఈఎస్ఐసీ మెడికల్ కాలేజీకి 106 సీట్లు దక్కాయి. నిజామాబాద్ గవర్నమెంట్ కాలేజీకి 98 సీట్లు, ఆదిలాబాద్ రిమ్స్ కు 90 సీట్లు, సిద్దిపేట ప్రభుత్వ కాలేజీకి 89 సీట్లు సీట్లు కేటాయించారు. అలాగే, రాష్ట్రంలోని 26 ప్రైవేట్, మైనారిటీ, డీమ్డ్ మెడికల్ కాలేజీల పరిధిలో మొత్తం 2,579 పీజీ బ్రాడ్ స్పెషాలిటీ సీట్లు నమోదయ్యాయి.
వారం రోజుల్లో బ్యాంక్ గ్యారెంటీ
కొత్తగా పీజీ కోర్సులు ప్రారంభించడానికి, సీట్లు పెంచుకోవడానికి అనుమతి పొందిన మెడికల్ కాలేజీలు నోటీసు వెలువడిన ఏడు రోజుల్లోగా మార్బ్ డైరెక్టర్ పేరిట ఎలక్ట్రానిక్ బ్యాంక్ గ్యారెంటీ సమర్పించాలని ఎన్ఎంసీ స్పష్టం చేసింది. నిర్ణీత ప్రొఫార్మాలో సమర్పించిన ఈ–బీజీ పత్రాలను పరిశీలించిన తర్వాతే ఎల్వోపీ జారీ చేస్తామని తేల్చిచెప్పింది. అలాగే కౌన్సెలింగ్ అధికారులు ఎన్ఎంసీ నోటిఫై చేసిన తాజా సీట్ మ్యాట్రిక్స్ ప్రకారమే ప్రవేశాలు నిర్వహించాలని స్పష్టం చేసింది. అనుమతించిన పరిమితికి మించి ఏ ఒక్క విద్యార్థిని కూడా చేర్చుకోవద్దని, నిబంధనలు అతిక్రమిస్తే ఎన్ఎంసీ కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించింది.
