ఖమ్మం టౌన్, వలుగు: ఖమ్మం నియోజకవర్గంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆఫీసర్లను ఆదేశించారు. మంగళవారం ఆయన కలెక్టర్ దివాకర, సీపీ సునీల్ దత్‌తో కలిసి అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. మంచుకొండ ఎత్తిపోతల పథకం పరిధిలోని చెరువులను నింపాలని, బుగ్గవాగు ఎత్తిపోతల పథకం పనులను వెంటనే ప్రారంభించాలని సూచించారు.
మున్నేరు రక్షణ గోడ పనులకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని, డ్రైనేజీ, ఆర్‌అండ్‌ఆర్ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. సాగు, తాగునీటికి ప్రాధాన్యత ఇస్తూ నీటి వనరులను సమర్థంగా వినియోగించాలని సూచించారు. కేబుల్ బ్రిడ్జి పనులను త్వరగా పూర్తి చేసి నవంబర్‌లో హ్యాండోవర్ చేయాలని, మెడికల్ కళాశాల హాస్టల్, అడ్మినిస్ట్రేటివ్ భవన పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.
మంజూరైన పనులకు ఈ నెలాఖరులోగా టెండర్ ప్రక్రియ పూర్తి చేసి అక్టోబర్ నుంచి పనులు ప్రారంభించాలన్నారు. వచ్చే యాసంగికి ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక సిద్ధం చేయాలని, ఆయిల్‌పామ్ సాగును విస్తరించాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్లకు అర్హులను త్వరగా ఎంపిక చేసి మంజూరు చేయాలని, వెలుగుమట్ల కాలనీలో ఇళ్లతో పాటు మౌలిక వసతుల పనులను నవంబర్ 21లోగా పూర్తి చేయాలని తెలిపారు.
ఖమ్మం నగర భవిష్యత్ విద్యుత్ అవసరాలకు అనుగుణంగా సబ్‌స్టేషన్లు, భూగర్భ కేబుళ్లను ప్రణాళిక చేయాలని సూచించారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులను వచ్చే జూన్‌లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఖమ్మం నియోజకవర్గంలో ఏడు కొత్త సబ్‌స్టేషన్లు ప్రతిపాదించామని, హ్యామ్ రోడ్లకు సంబంధించి 10 పనులకు రూ.36.60 కోట్ల మంజూరు లభించిందని కలెక్టర్ దివాకర తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్‌లో మంజూరైన 137 పనుల్లో 54 పూర్తయ్యాయని, మరో 54 పనులు పురోగతిలో ఉన్నాయని అధికారులు వెల్లడించారు.
