ట్రైన్ జనరల్ బోగీలో రక్తం కారుతున్న ట్రాలీ బ్యాగ్.. తెరిచి చూసి షాకయిన రైల్వే పోలీసులు !

ట్రైన్ జనరల్ బోగీలో రక్తం కారుతున్న ట్రాలీ బ్యాగ్.. తెరిచి చూసి షాకయిన రైల్వే పోలీసులు !

ఆగ్రా: చెన్నై-న్యూఢిల్లీ తమిళనాడు ఎక్స్‌ప్రెస్ రైలులో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. జనరల్ బోగీలోని ఒక ట్రాలీ బ్యాగ్లో మనిషి మృతదేహం ప్యాక్ చేసి ఉంచిన ఘటన కలకలం రేపింది. పాక్షికంగా కుళ్ళిపోయిన స్థితిలో మనిషి శరీర భాగాలు ట్రాలీ బ్యాగ్లో ప్యాక్ చేసి ఉన్నాయి. ప్రభుత్వ రైల్వే పోలీసులు( జీఆర్‌పీ ), రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ( ఆర్‌పీఎఫ్ ) ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నాయి.

జీఆర్పీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. జనరల్ కంపార్ట్‌మెంట్ వెనుక భాగంలో ఒక ఎర్రటి ట్రాలీ బ్యాగ్ నుంచి రక్తం కారుతుండగా ఒక ప్రయాణికుడు గమనించాడు. దీంతో.. ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ బ్యాగ్ నుంచి దుర్వాసన రావడంతో ఆ ప్రయాణికుడు రైల్వే హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించాడు. ఆ తర్వాత కంట్రోల్ రూమ్ సిబ్బంది జీఆర్పీకి చెప్పారు.

బుధవారం తెల్లవారుజామున రైలు గ్వాలియర్‌ను దాటి ఆగ్రా కంటోన్మెంట్‌కు సమీపిస్తున్న సమయంలో కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందిందని జీఆర్‌పీ డిప్యూటీ ఎస్పీ రాజేష్ దీక్షిత్ తెలిపారు. జనరల్ కోచ్‌లో ఉన్న ఎర్రటి ట్రాలీ బ్యాగ్ నుంచి రక్తం కారుతోందని, తీవ్రమైన దుర్వాసన వస్తోందని ఫోన్ చేసిన వ్యక్తి తమకు చెప్పినట్లు దీక్షిత్ చెప్పారు. రైలు అప్పటికే గ్వాలియర్‌ రైల్వే స్టేషన్ నుంచి వెళ్లిపోయింది. దీంతో.. ఈ సమాచారాన్ని వెంటనే ఆగ్రా కంటోన్మెంట్‌లోని జీఆర్‌పీ, ఆర్‌పిఎఫ్ బృందాలకు చేరవేశారు.

బుధవారం ఉదయం సుమారు 5.30 గంటలకు రైలు ఆగ్రా కంటోన్మెంట్ ప్లాట్‌ఫామ్ నెం. 3కి చేరుకుంది. జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్ సిబ్బంది కోచ్‌లోకి వెళ్లి బ్యాగ్‌ను తెరిచి చూశారు. బ్యాగ్ లోపల.. తెగిపోయిన చేయి, మొండెం భాగంతో సహా కుళ్ళిపోయిన మనిషి శరీర భాగాలు కనిపించాయి. కుళ్ళిపోవడం వల్ల ఆ అవశేషాలు నల్లగా మారిపోయాయి. తల కనిపించలేదు.

రైలు ప్రయాణంలో అవశేషాలను పారవేసే ప్రయత్నంలో.. బాధితురాలిని వేరే చోట హత్య చేసి, ఆ తర్వాత శరీరాన్ని ముక్కలు చేసి ట్రాలీ బ్యాగ్‌లో ప్యాక్ చేసి ఉండవచ్చని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. బ్యాగ్‌ను పరిశీలించగా.. చెన్నైకి చెందిన ఒక సంస్థ పేరు ఉన్న ప్యాకేజింగ్ మెటీరియల్‌ను పోలీసులు కనుగొన్నారు. ఈ ఆధారంతో హత్యకు గురైన మహిళ స్వస్థలం తమిళనాడు అయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.