సల్కం చెరువు కేసులో అధికారులకు హైకోర్టు నోటీసులు..కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారంటూ కంటెంప్ట్ పిటిషన్‌‌

సల్కం చెరువు కేసులో అధికారులకు హైకోర్టు నోటీసులు..కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారంటూ కంటెంప్ట్ పిటిషన్‌‌
  • జయేశ్‌‌రంజన్,ఏవీ రంగనాథ్‌‌లకు నోటీసులు 
  • కలెక్టర్‌‌ను కూడా కేసులో చేర్చేందుకు అనుమతి

హైదరాబాద్, వెలుగు: పాతబస్తీ బండ్లగూడలోని సల్కం చెరువు వ్యవహారం మరోసారి హాట్ టాపిక్‌‌గా మారింది. చెరువు స్థలం, ఎఫ్‌‌టీఎల్‌‌, నిర్మాణాల విషయంలో అధికారులు కోర్టుకు తప్పు సమాచారం ఇచ్చారంటూ హైకోర్టులో కాంటెంప్ట్ (కోర్టు ధిక్కరణ) పిటిషన్‌‌ దాఖలైంది. ఈ పిటిషన్‌‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. పురపాలక శాఖ స్పెషల్ సీఎస్ జయేశ్‌‌రంజన్, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌‌తో పాటు విద్య, రెవెన్యూ, నీటిపారుదలశాఖల్లోని ఉన్నతాధికారులకు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. సల్కం చెరువులో సాలార్ ఎ మిల్లత్ విద్యా ట్రస్ట్ నిర్వహిస్తున్న బారిస్టర్ ఫాతిమా ఓవైసీ ఎడ్యుకేషనల్ క్యాంపస్ నిర్మాణాలపై విచారణ చేసి రిపోర్ట్ ఇవ్వాలని గతంలో కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే ఆ ఆదేశాలు అమలు కాలేదని న్యాయవాది విజయ్‌‌గోపాల్ కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు. పిటిషనర్ తరఫు లాయర్ వాదిస్తూ.. సర్వే నంబర్ 62లోని భూమి ప్రభుత్వ చెరువుకు సంబంధించినదని గతంలోనే కోర్టు తీర్పులు ఉన్నాయని తెలిపారు. 1997, 2010, 2015లో కూడా ఇదే విషయాన్ని కోర్టులు స్పష్టం చేశాయని చెప్పారు.

 అయితే గత ఏప్రిల్‌‌ 9న అధికారులు కోర్టుకు ఇచ్చిన సమాచారంలో నిజాలు దాచారని ఆరోపించారు. ఎఫ్‌‌టీఎల్‌‌ విషయంలో కొత్తగా సర్వే చేసి నోటిఫికేషన్ ఇచ్చారని, ఇది నిబంధనలకు విరుద్ధమని వాదించారు. చెరువు భూమి నిషేధిత లిస్ట్‌‌లో ఉన్నా రిజిస్ట్రేషన్లు ఎలా జరిగాయో అధికారులు చెప్పాల్సి ఉందన్నారు. కోర్టు ఆదేశాలను కావాలనే ఉల్లంఘించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. 

అలాగే కలెక్టర్‌‌ను కూడా ప్రతివాదిగా చేర్చేందుకు అనుమతి ఇవ్వాలని కోరగా.. హైకోర్టు అంగీకరించింది. వాదనలు విన్న జస్టిస్ ఎన్‌‌.వి.శ్రవణ్‌‌కుమార్‌‌.. అధికారులకు నోటీసులు జారీ చేసి, పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించారు. తదుపరి విచారణను 11వ తేదీకి వాయిదా వేశారు.