నేను బీఆర్ఎస్‌‌లో చేరడం అబద్ధం.. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు మద్దతు.. ఎమ్మెల్యే దానం నాగేందర్

నేను బీఆర్ఎస్‌‌లో చేరడం అబద్ధం.. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు  మద్దతు.. ఎమ్మెల్యే దానం నాగేందర్

నారాయణగూడ, వెలుగు: తాను తిరిగి బీఆర్ఎస్‌‌లో చేరుతున్నానంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పష్టం చేశారు. తాను బీఆర్ఎస్‌‌ను ప్రశంసించినట్లు వీడియోలను వక్రీకరించి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. 

హైదరాబాద్‌‌లోని హిమాయత్‌‌నగర్‌‌లో ఉజ్వల రికవరీ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్ ప్రారంభోత్సవం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మాజీ సీఎంలు వైఎస్ ఆర్​, కేసీఆర్‌‌లతో పాటు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని తాను చెప్పిన వ్యాఖ్యలను వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని అన్నారు. 

సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నారంటూ కూడా కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇలాంటి దుష్ప్రచారాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. కాంగ్రెస్‌‌ను అధికారంలోకి తీసుకురావడానికి సీఎం రేవంత్ రెడ్డి ఎంతో కష్టపడ్డారని, అలాంటి నాయకుడు మరో పార్టీలో చేరాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నారని, వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌‌కే పట్టం కడతారని అన్నారు.