బైక్ లను ఢీకొట్టి పారిపోతుండగా.. మంటలు అంటుకొని కారు దగ్ధం..నిజామాబాద్ జిల్లా నందిపేటలో ఘటన

బైక్ లను ఢీకొట్టి పారిపోతుండగా.. మంటలు అంటుకొని కారు దగ్ధం..నిజామాబాద్ జిల్లా నందిపేటలో ఘటన
  •  ప్రమాదంలో నలుగురు యువకులకు గాయాలు..

నందిపేట, వెలుగు : ఓ యువకుడు తన కారులో రాంగ్ రూట్ లో వెళ్తూ రెండు బైక్ లను ఢీకొట్టడంతో నలుగురికి గాయాలయ్యాయి. అనంతరం పారిపోయే ప్రయత్నంలో మంటలు అంటుకొని కారు పూర్తిగా దగ్ధం అయింది. ఈ ప్రమాదం నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది. ఎస్సై వినయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. నందిపేట మండలంలోని సీహెచ్.కొండూర్ గ్రామానికి చెందిన అవుసలి గంగాధర్ గురువారం తన కారులో మాక్లూర్ మండలంలోని డీకంపల్లి గ్రామానికి వెళ్లి రాత్రి 10 గంటలకు తిరిగి వస్తున్నాడు. 

విజయనగరం గ్రామ సమీపంలో రాంగ్​రూట్​లో వచ్చి ఆర్మూర్​వైపు వెళ్తున్న రెండు బైక్ లను ఢీకొట్టాడు. ప్రమాదంలో నందిపేటకు చెందిన, ముప్కాల్ పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న మహ్మద్ అక్తర్ తో పాటు మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం అనంతరం గంగాధర్ కారును ఆపకుండా అక్కడి నుంచి పరార్ అయ్యాడు. నందిపేట శివారులోని సబ్​స్టేషన్​సమీపంలోకి రాగానే కారులో మంటలు చెలరేగాయి. గమనించిన గంగాధర్ బయటకు రాగా... కారు పూర్తిగా దగ్ధమైంది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.