ఉత్తరాఖండ్ లో విరిగిపడిన కొండచరియలు..చిక్కుకుపోయిన 15వందల మంది కేదార్‌నాథ్ యాత్రికులు

ఉత్తరాఖండ్ లో విరిగిపడిన కొండచరియలు..చిక్కుకుపోయిన 15వందల మంది కేదార్‌నాథ్ యాత్రికులు

ఉత్తరాఖండ్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో కేదార్‌నాథ్ యాత్రా మార్గంలోని చిర్‌బాసా ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి.  దాదాపు 15వందల మంది యాత్రికులు చిక్కుకుపోయారు. గౌరీకుండ్‌కు సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిర్‌బాసా హెలిప్యాడ్ సమీపంలో కొండచరియలు విరిగిపడటంతో రహదారి పూర్తిగా బండరాళ్లు, మట్టితో మూసుకుపోయింది. అదే సమయంలో కొండల నుంచి నిరంతరం రాళ్లు జారిపడుతుండటంతో యాత్రికుల రాకపోకలు ప్రమాదకరంగా మారాయి. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, SDRF బృందం సంఘటనా స్థలానికి చేరుకుని సహాయచర్యలు చేపట్టాయి. యాత్రికులను సురక్షితంగా గౌరీముండ్ కు తరలించారు.  

అనంతరం SDRF, NDRF, DDRF బృందాలు సమన్వయంతో యాత్రికులను ఒక్కొక్కరుగా కొండచరియలు విరిగిన ప్రాంతం నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించాయి. అనంతరం గౌరీకుండ్‌కు తరలించారు. రెస్క్యూ ఆపరేషన్ ఆదివారం రాత్రి ఆలస్యంగా ప్రారంభమై సోమవారం ఉదయం వరకు కొనసాగింది.

ఇదిలా ఉండగా..భారీ వర్షాల కారణంగా ఉత్తరాఖండ్‌లోని చార్ ధామ్ యాత్ర ఆదివారం వరుసగా రెండో రోజు నిలిపివేశారు. వాతావరణ పరిస్థితులు మెరుగుపడే వరకు యాత్రికులు అధికారుల సూచనలు పాటించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.