కోటి రూపాయల కట్నం తెచ్చినా సరే.. నెలకు లక్షల్లో సంపాదిస్తున్నా సరే.. కొన్ని కుటుంబాల్లో అత్తింటి వారికి అది చాలదు. కట్నం కట్నం అంటూ వేధిస్తూ చివరికి నవవధువులు ఆత్మహత్య చేసుకునేలా టార్చర్ పెడుతున్నారు.. లేదంటే వాళ్లే చంపేస్తున్నారు. ఎన్ని ఘటనలు జరిగినా.. ఎన్ని కేసులు అయినా వరకట్నం, గృహహింస మాత్రం తగ్గడం లేదు. పుణెలో వరకట్న వేధింపుల బారిన పడి సాఫ్ట్ వేర్ ఉద్యోగిని చనిపోయిన తీరు తీవ్ర విషాదంగా మిగిలింది.
పుణెకు చెందిన వైష్ణవి ప్రవీణ్ జరందే.. కోటి రూపాయల వరకు కట్నకానులకు ఇచ్చినా.. కేవలం 5 లక్షల రూపాయల అదనపు కట్నం వేధింపులకు బలి కావాల్సి వచ్చింది. అత్తింటి వారి ఫిజికల్ హరాస్మెంట్ కు తనువు చాలించింది.
వైష్ణవి 2026 మే 9వ తేదీన ఓంకార్ సంజయ్ ఘిసారే ను వివాహం చేసుకుంది. మూడు నాలుగు నెలలు కానేలేదు.. కోటి ఆశలతో అత్తింటిలో అడుగుపెట్టిన ఆ నవవధువుకు అప్పుడు చుక్కలు చూపించడంతో.. ఈ టార్చర్ నాకు వద్దు అని ఆత్మహత్య చేసుకుంది.
కారు కోసం రూ.5 లక్షల డిమాండ్:
తన బంగారం లాంటి కూతురును కట్నం కోసం భర్త, అత్తమామలు చంపేశారని వైష్ణవి పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. పెళ్లి సమయంలో 45 లక్షల క్యాష్ ఇచ్చామని, 10 తులాల బంగారం, పెళ్లి ఖర్చులు, ఆ తర్వాత అల్లుడికి ఇచ్చిన డబ్బు అంతా కలిసి దాదాపు కోటి రూపాయల వరకు ముట్టజెప్పినట్లు తెలిపారు. అయినప్పటికీ కారు కొనేందుకు మరో ఐదు లక్షల రూపాయలు ఇవ్వాల్సిందిగా గత కొద్దిరోజులుగా టార్చర్ పెడెతున్నట్లు చెప్పారు.
పెళ్లి తర్వాత వైష్ణవి, ఆమె భర్త బెంగళూరులో జాబ్ కోసం సెటిల్ అయ్యారు. జూన్ ఎండింగ్ లో అత్తగారి ఇంటికి వచ్చి.. వర్క్ ఫ్రమ్ హోం సదుపాయం ఉండటంతో ఇంటి వద్దనే ఉండి జాబ్ చేస్తోంది. అయితే మెంటల్, ఫిజికల్ హరాష్మెంట్ కారణంగా చనిపోయినట్లు చెబుతున్నారు.
చనిపోయే ముందు తల్లికి ఫోన్:
ఫిర్యాదు ప్రకారం.. సెప్టెంబర్ 24 రాత్రి వైష్ణవి తన తల్లికి ఫోన్ చేసి మాట్లాడింది. వేధింపుల గురించి చెప్పి కన్నీరు పెట్టుకుంది. ఆ తర్వాత అదే రాత్రి 11.30 గంటలకు వైష్ణవి భర్త కూడా అత్తమామలకు ఫోన్ చేశాడు.
ఆ తర్వాత వైష్ణవి ఫోన్ కలవక పోవడంతో.. హుటాహుటిన బయల్దేరి పుణెకు చేరుకున్నారు. అప్పటికే వైష్ణవి చనిపోయినట్లు చెప్పడంతో షాక్ తిన్నారు.
వైష్ణవి తండ్రి ఫిర్యాదు మేరకు కేస్ రిజస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. వరకట్న నిషేధ చట్టం కింద విచారణ జరుపుతున్నారు. నిజానిజాలు తేల్చి చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు.
