బ్యాంకింగ్ రంగానికి సంబంధించి శుభవార్త అందింది. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(IBA), యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(UFBU) మధ్య జరిగిన కీలక చర్చలు సఫలం కావడంతో.. సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు తలపెట్టిన 3 రోజుల దేశవ్యాప్త బ్యాంకుల సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేశారు. ఈ మేరకు సెప్టెంబర్ 27 రాత్రి 9:30 గంటలకు ప్రారంభమైన చర్చల అనంతరం యూనియన్లు కొత్త నిర్ణయం తీసుకున్నట్లు సర్క్యులర్ ద్వారా వెల్లడించాయి.
సమ్మె విరమణకు ప్రధాన కారణం IBAతో జరిగిన సమావేశంలో ఇరువర్గాల మధ్య పలు డిమాండ్లపై సానుకూల వాతావరణంలో చర్చలు జరగడమే. ముఖ్యంగా మిగిలిన అన్ని శనివారాలను కూడా బ్యాంక్ సెలవుదినాలుగా ప్రకటించాలన్న యూనియన్ల డిమాండ్‌ను పరిశీలించడానికి యూనియన్ ప్రతినిధులతో కూడిన ఒక హై-లెవల్ కమిటీని తక్షణమే ఏర్పాటు చేయడానికి ఇరువర్గాలు అంగీకరించాయి. ఇది 5 రోజుల బ్యాంకింగ్ వ్యవస్థ వైపు అడుగులు వేయడానికి మార్గం సుగమం చేస్తుంది.
అలాగే స్కేల్-4 ఆఫీసర్లు.. అంతకంటే పైస్థాయి అధికారులకు సంబంధించిన పెర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకంపై కూడా చర్చలు పునఃప్రారంభం కానున్నాయి. యూనియన్లు లేవనెత్తిన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుంటూ.. తగిన మార్పులతో కూడిన ప్రతిపాదనలను ప్రభుత్వం ముందుంచాలని ఐబీఏ నిర్ణయించింది. మార్చి 8, 2024 నాటి సమావేశంలోని పెండింగ్ అంశాలపై కూడా త్వరలోనే పరిష్కారం కనుగొంటామని హామీ లభించింది.
ఈ హామీలతో బ్యాంక్ యూనియన్లు తమ సమ్మెను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా బ్యాంకు కస్టమర్లకు ఎలాంటి అంతరాయం లేకుండా సాధారణ బ్యాంకింగ్ సేవలు యథావిధిగా కొనసాగనున్నాయి. మునుపటి వాగ్దానాల అమలులో జరుగుతున్న ఆలస్యం వల్లే సమ్మెకు పిలుపునిచ్చినట్లు యూనియన్లు పేర్కొన్నప్పటికీ.. ప్రస్తుత చర్చలు సానుకూల ఫలితాలను ఇస్తాయన్న నమ్మకంతో బ్యాంకింగ్ సర్వీసులు తిరిగి సాధారణంగా కొనసాగుతున్నాయి. సో ఆదివారం రాత్రి జరిగిన ఒక సమావేశం కోట్ల మంది ప్రజల బ్యాంకింగ్ కష్టాలకు బ్రేక్ వేసింది.
