ధరలు భగ్గుమంటున్నాయ్..పెరుగుతున్న ద్రవ్యోల్భణంపై మాట్లాడరేం..? ప్రధాని మోదీపై కాంగ్రెస్ ఫైర్

ధరలు భగ్గుమంటున్నాయ్..పెరుగుతున్న ద్రవ్యోల్భణంపై మాట్లాడరేం..? ప్రధాని మోదీపై కాంగ్రెస్ ఫైర్

దేశంలో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోతోంది..నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పండుగల సీజన్ లో పేద, మధ్యతరగతి ప్రజలు ఏ కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు..ద్రవ్యోల్బణం వంటింటి సరుకులకే పరిమితం కాలేదు.. కూరగాయలు, ఏసీలు, టీవీలు, ఫ్రిజ్‌లు వంటి గృహోపకరణాల ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి.  ద్రవ్యోల్బణం నియంత్రణలో కేంద్రం ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ప్రధాని మోదీపై కాంగ్రెస్ విమర్శలు చేసింది.  

పండుగ సీజన్‌లో పెరుగుతున్న ధరలపై కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని మోదీని కాంగ్రెస్ తీవ్రంగా విమర్శించింది. ద్రవ్యోల్బణం ప్రభావం కేవలం వంటింటి సరుకులకే పరిమితం కాలేదని, ఇప్పుడు గృహ అవసరాలపై కూడా పడుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. 

రోజురోజుకూ కూరగాయల ధరలు పెరుగుతున్నాయని, ఆగస్టులో ఉల్లి ధర ఏకంగా 49శాతం పెరిగిందని కాంగ్రెస్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి తోడు ఏసీలు, టీవీలు, ఫ్రిజ్‌లు వంటి గృహోపకరణాల ధరలు కూడా పెరగనున్నాయన్నారు.  ఇప్పటికే పెరుగుతున్న ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజలకు ఈ ధరల పెరుగుదల మరింత భారంగా మారుతుందన్నారు. 

మరోవైపు కుటుంబాల పొదుపు తగ్గిపోతుండగా, అప్పుల భారం పెరుగుతోందని కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో మధ్యతరగతి, పేద కుటుంబాలు తమ రోజువారీ అవసరాలను ఎలా తీర్చుకోవాలని ప్రశ్నించింది.

ప్రధాని మోదీ ‘మన్ కీ బాత్’లో అనేక అంశాలపై మాట్లాడుతున్నారని గానీ దేశ ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న ద్రవ్యోల్బణంపై ఎప్పుడు స్పందిస్తారని ప్రశ్నించింది. పెరుగుతున్న ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పటికీ ప్రభుత్వం నుంచి తగిన ఉపశమనం లభించడం లేదని ఆరోపించింది. సగటు జీవులు  కుటుంబ పోషణ ఎలా చేసుకోగలరని   ప్రశ్నించింది. పెరుగుతున్న ధరల భారాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.

అయితే ఇందుకు భిన్నంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటనలు చేస్తోంది. దేశ జీడీపీ వృద్ధి బలంగా కొనసాగుతోందని, భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా విస్తరిస్తోందని ప్రభుత్వం చెబుతోంది.