రివ్యూ కోసం స్టేడియంలోనే కెప్టెన్‌తో వికెట్ కీపర్ కొట్లాట.. ఆస్ట్రేలియాపై సిరీస్ కైవసం!

రివ్యూ కోసం స్టేడియంలోనే కెప్టెన్‌తో వికెట్ కీపర్ కొట్లాట.. ఆస్ట్రేలియాపై సిరీస్ కైవసం!

Bavuma and de Kock Clash: ఆస్ట్రేలియాతో (Australia) జరుగుతున్న వన్డే సిరీస్‌ను దక్షిణాఫ్రికా (South Africa) మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. రెండో వన్డేలో అద్భుతమైన ఆల్-రౌండ్ ప్రదర్శన కనబరిచిన సఫారీ జట్టు, ఆసీస్‌ను ఓడించి సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకుంది. కానీ ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా విజయం సాధించినప్పటికీ.. కెప్టెన్ టెంబా బావుమా (Temba Bavuma), వికెట్ కీపర్ క్వింటన్ డి కాక్ (Quinton de Kock) మధ్య జరిగిన గొడవ (DRS Clash) ప్రస్తుతం క్రికెట్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

సెంచరీలతో చెలరేగిన మిల్లర్, బావుమా: 

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 365 పరుగులు సాధించింది. స్టార్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ (David Miller) 142 పరుగులు చేయగా, కెప్టెన్ టెంబా బావుమా (103 పరుగులు) శతకంతో చెలరేగాడు. వీరిద్దరూ కలిసి నాలుగో వికెట్‌కు 156 రన్స్ భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును పటిష్ట స్థితిలో నిలిపారు. ఆస్ట్రేలియా బౌలర్లలో జాక్ ఎడ్వర్డ్స్ (Jack Edwards) 5/67 వికెట్లు పడగొట్టాడు.

సిరీస్ కైవసం చేసుకున్న సఫారీలు:

భారీ లక్ష్య ఛేదన కోసం బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు గట్టి పోటీ ఇచ్చింది. ఓపెనర్లు మిచెల్ మార్ష్ (Mitch Marsh), ట్రావిస్ హెడ్ (Travis Head) మొదటి వికెట్‌కు 130 పరుగులు జోడించి అద్భుతమైన ఆరంభాన్నిచ్చారు. ఇద్దరూ హాఫ్ సెంచరీలతో రాణించారు. కానీ, సఫారీ స్పిన్నర్లు కేశవ్ మహారాజ్ (Keshav Maharaj), బ్జోర్న్ ఫోర్టుయిన్ (Bjorn Fortuin), ఐడెన్ మార్క్రమ్ (Aiden Markram) కలిసి ఐదు వికెట్లు పడగొట్టి ఆసీస్ జోరుకు కళ్లెం వేశారు.

ఆఖర్లో జావియర్ బార్ట్లెట్ (Xavier Bartlett) కేవలం 26 బంతుల్లోనే 50 రన్స్ తో ఒంటరి పోరాటం చేసినప్పటికీ, ఆస్ట్రేలియా జట్టు 333 పరుగులకు ఆలైట్ అయింది. చివరికి రెండు బంతులు మిగిలి ఉండగానే ఆసీస్‌ను ఆలౌట్ చేసిన దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాపై వరుసగా ఆరో ద్వైపాక్షిక వన్డే సిరీస్‌ను (Sixth consecutive bilateral ODI series win) సొంతం చేసుకుంది.

మైదానంలోనే బావుమా, డి కాక్ కొట్లాట: 

ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 48వ ఓవర్‌లో ఒక నాటకీయ పరిణామం చోటు చేసుకుంది. లిజాద్ విలియమ్స్ (Lizaad Williams) వేసిన ఖచ్చితమైన యార్కర్‌కు జావియర్ బార్ట్లెట్ ఎల్బీడబ్ల్యూగా దొరికిపోయాడు. ఆన్-ఫీల్డ్ అంపైర్ నాటౌట్ ఇవ్వగా.. బౌలర్ రివ్యూ కోరాలని పట్టుబట్టాడు. కానీ, వికెట్ కీపర్ క్వింటన్ డి కాక్ మాత్రం రివ్యూ తీసుకోడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు.

దీంతో రంగంలోకి దిగిన కెప్టెన్ టెంబా బావుమా స్వయంగా డీఆర్ఎస్ (DRS) కోరాలని నిర్ణయించుకున్నాడు. ఈ నిర్ణయంపై బావుమా, డి కాక్‌ల మధ్య మైదానంలోనే తీవ్ర వాగ్వాదం జరగడంతో తోటి ప్లేయర్స్ వచ్చి వారిని సముదాయించాల్సి వచ్చింది. కానీ, రివ్యూలో బాల్ నేరుగా వికెట్లను తాకుతున్నట్లు తేలడంతో బార్ట్లెట్ పెవిలియన్ చేరాడు. బావుమా తీసుకున్న ఆ ఒక్క నిర్ణయం మ్యాచ్‌ను పూర్తిగా మలుపు తిప్పింది.