కావేరిపై చీప్ పాలిటిక్స్ చేయను.. చర్చలకు వెళ్లాలన్న ఆలోచన నాదే: తమిళనాడు సీఎం విజయ్

కావేరిపై చీప్ పాలిటిక్స్ చేయను.. చర్చలకు వెళ్లాలన్న ఆలోచన నాదే: తమిళనాడు సీఎం విజయ్
  • ప్రజల కోసం అవమానాలు భరించడానికైనా సిద్ధం.. 
  • మేకెదాటు ప్రాజెక్టుపై రాజీ పడేది లేదని వ్యాఖ్య 

చెన్నై: కావేరి జలాల వివాదంపై తాను ఎప్పుడూ చీప్ పాలిటిక్స్ చేయనని తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ స్పష్టం చేశారు. కర్నాటక ప్రభుత్వంతో చర్చలు జరిపి సమస్యకు పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేయాలన్న ఆలోచన తనదేనని తెలిపారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం అవసరమైతే అవమానాలు ఎదురైనా భరిస్తానని అన్నారు. 

అయితే ఈ విషయం,  మేకెదాటు డ్యామ్ నిర్మాణాన్ని అడ్డుకోవడంలోనూ తమ ప్రభుత్వం ఏమాత్రం వెనక్కి తగ్గదని తేల్చిచెప్పారు. శుక్రవారం తమిళనాడు అసెంబ్లీలో కావేరి అంశంపై జరిగిన ప్రత్యేక చర్చలో విజయ్ మాట్లాడారు. 1969 నుంచే ఈ వివాదంలో చర్చలు, న్యాయపోరాటం రెండూ కొనసాగుతున్నాయని చెప్పారు. 

అప్పట్లో డీఎంకే ప్రభుత్వమే రెండు రాష్ట్రాలు, కేంద్రం కలిసి చర్చలు జరపాలని అసెంబ్లీలో చెప్పిందని గుర్తుచేశారు. ‘‘అప్పుడు జలవనరుల మంత్రి ఎవరు? ఆనకట్టలు ఎందుకు నిర్మించనిచ్చారు? అంటూ ఇప్పుడు ప్రశ్నలు వేసి చీప్ పాలిటిక్స్ చేయాలనుకోవడం లేదు’’ అని వ్యాఖ్యానించారు. 

‘‘తమిళనాడు ప్రజల కోసం అవమానం ఎదురైనా భరిస్తా’’ అని చెప్పారు.   మేకెదాటు ప్రాజెక్టుకు చట్టపరమైనా, పరిపాలనా పరమైనా అనుమతులు ఇవ్వొద్దని ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసినట్లు తెలిపారు. కావేరి ట్రిబ్యునల్ తుది తీర్పు, సుప్రీంకోర్టు తీర్పులోని నిబంధనలను కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. 

ఇదే సమయంలో డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్, అన్నాడీఎంకే నేత ఎడప్పాడి కె. పళనిస్వామి కావేరి అంశంపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేశారు. 

ఆ కోర్సులపై నిర్ణయాధికారం రాష్ట్రాలకే.. 

వెటర్నరీ కోర్సుల్లో ప్రవేశాలకు కేంద్రం ప్రతిపాదించిన కామన్ ఎంట్రన్స్ పరీక్షను, లేదా నీట్-యూజీ 2026 మెరిట్ ఆధారంగా అడ్మిషన్లు ఇవ్వాలన్న వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా  నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరుతూ సీఎం విజయ్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. దశాబ్దాలుగా తమిళనాడులో ప్రొఫెషనల్ కోర్సుల్లో ఇంటర్ మార్కుల ఆధారంగానే ప్రవేశాలు ఇస్తున్నామని, దీనివల్ల గ్రామీణ ప్రాంతాలు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉన్నత విద్యలో అవకాశాలు లభిస్తున్నాయని పేర్కొన్నారు.   

 విజయ్‌‌‌‌ భార్య సంగీత విడాకుల పిటిషన్ ఉపసంహరణ

తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్‌‌‌‌పై దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌‌‌‌ను ఆయన భార్య సంగీత ఉపసంహరించుకున్నారు. కుటుంబ న్యాయస్థానంలో పెండింగ్‌‌‌‌లో ఉన్న పిటిషన్‌‌‌‌ను తాజాగా వెనక్కి తీసుకున్నట్లు కోర్టు వర్గాలు తెలిపాయి. కొంతకాలంగా ఇద్దరూ విడిగా ఉంటున్నారనే ప్రచారం జరిగినప్పటికీ, ఇటీవల కుటుంబ సభ్యుల స్థాయిలో జరిగిన చర్చల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై విజయ్ గానీ, సంగీత గానీ అధికారికంగా స్పందించలేదు.