ప్రతిరోజూ కూల్ డ్రింక్స్, సోడా తాగుతున్నారా.. క్యాన్సర్ డబుల్ గ్యారంటీ.. రీసెర్చ్‌లో షాకింగ్ నిజాలివే !

ప్రతిరోజూ కూల్ డ్రింక్స్, సోడా తాగుతున్నారా.. క్యాన్సర్ డబుల్ గ్యారంటీ.. రీసెర్చ్‌లో  షాకింగ్ నిజాలివే !

మీరు రోజూ సోడా, కూల్ డ్రింక్స్, ప్యాక్ చేసిన ఫ్రూట్ జ్యూస్‌లు లేదా బాగా తీపి ఉన్న స్పోర్ట్స్ డ్రింక్స్ తాగుతున్నారా..? అయితే ఈ పరిశోధన మీ కోసమే ! ప్రతిరోజూ ఒక చక్కెర పానీయం తాగడం వల్ల కడుపు క్యాన్సర్ (Stomach/Gastric Cancer) వచ్చే ప్రమాదం రెట్టింపు కంటే ఎక్కువవుతుందని 'మాస్ జనరల్ బ్రిగమ్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్' చేసిన ఒక అధ్యయనంలో తేలింది.

 'గ్యాస్ట్రో హెప్ అడ్వాన్సెస్' జర్నల్‌లో ప్రచురించిన  ఈ రీసర్చ్, దాదాపు 1 లక్ష 12 వేల 284 మంది ఆరోగ్య వివరాలను దశాబ్దాల పాటు పరిశీలించి ఈ విషయాలను వెల్లడించింది.

పరిశోధనలో తేలిన విషయాలు:
నెలకు ఒక్కసారి లేదా అసలు చక్కెర పానీయాలు తాగని వారితో పోలిస్తే, రోజుకు కనీసం ఒక డ్రింక్ తాగే వారికి కడుపు క్యాన్సర్ వచ్చే ప్రమాదం 2.45 రెట్లు (245%) పెరిగింది. ముఖ్యంగా మహిళల్లో ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉంది. ప్రతిరోజు చక్కెర పానీయాలు తీసుకునే మహిళల్లో క్యాన్సర్ వచ్చే అవకాశం 3.04 రెట్లు పెరిగింది.

అసలు విలన్ 'చక్కెరే'!
పరిశోధకులు ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్  ఉన్న డ్రింక్స్ (Diet Drinks / Artificial Sweetened Beverages) తాగే వారిని కూడా పరిశీలించారు. అయితే వారిలో క్యాన్సర్ ప్రమాదం పెరగలేదు. దీన్ని బట్టి డ్రింక్స్‌లో వాడే ఫ్రక్టోజ్ (Fructose) వంటి అధిక చక్కెరలే ఈ క్యాన్సర్ ప్రమాదానికి ముఖ్య కారణమని స్పష్టమవుతోంది.

కడుపు క్యాన్సర్ ఎంత ప్రమాదకరం?
ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ మరణాలకు కారణమయ్యే వ్యాధుల్లో జీర్ణాశయ (కడుపు) క్యాన్సర్ 5వ స్థానంలో ఉంది. మన ఆహార అలవాట్లకు, ఈ క్యాన్సర్‌కు ఉన్న బంధాన్ని అమెరికా జనాభాపై నిరూపించిన మొదటి అధ్యయనం ఇదే.

ఈ రీసర్చ్ చక్కెర డ్రింక్స్‌కు, క్యాన్సర్‌కు మధ్య ఉన్న సంబంధాన్ని (Correlation) మాత్రమే చూపించింది తప్ప, నేరుగా డ్రింక్ మాత్రమే క్యాన్సర్‌ కలిగిస్తుందని 100 శాతం నిరూపించలేదని పరిశోధకులు స్పష్టం చేశారు. అలాగే, ఇందులో పాల్గొన్న వారిలో ఎక్కువమంది శ్వేతజాతీయులే ఉండటం వల్ల ఇతర దేశాల ప్రజలపై దీని ప్రభావాన్ని మరింత లోతుగా అధ్యయనం చేయాల్సి ఉందన్నారు.

 ఏం చేయాలి?
కడుపు క్యాన్సర్‌ను పెంచే యంత్రాంగాలు ఏంటో పూర్తిగా తెలియడానికి మరిన్ని పరిశోధనలు కావాలి. కానీ, ప్రాసెస్ చేసిన షుగర్ డ్రింక్స్ స్థానంలో నీరు, మజ్జిగ, నిమ్మరసం లేదా సహజమైన కొబ్బరినీళ్లు తాగడం మన ఆరోగ్యానికి ఎంతో మంచిది!