వందే మాతరం గీతాలాపనపై రాజకీయ వివాదం నెలకొన్న వేళ కీలక వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. వందే మాతరం ఆరు చరణాలు తప్పనిసరిగా ఆలపించాలన్న కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టింది సర్వోన్నత న్యాయస్థానం. వందేమాతర గీతం ఆరు చరణాలు పాడాలా, ఒక చరణం పాడాలా అన్నది పౌరుల వ్యక్తిగత నిర్ణయమని.. ఆరు చరణాలు పాడకుంటే శిక్షాత్మక చర్యలు తీసుకోలేరని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు టీఎం కృష్ణ దాఖలు చేసిన పిటిషన్ ను మంగళవారం ( సెప్టెంబర్ 22 ) విచారించిన సుప్రీంకోర్టు ఈమేరకు కీలక వ్యాఖ్యలు చేసింది.
వందే మాతరం అంశంలో కేంద్రం విధించే శిక్షాత్మక చర్యలను పరిశీలిస్తామని తెలిపిన సుప్రీంకోర్టు.. వందేమాతరం సవరణ చట్టం, మార్గదర్శకాలపై కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. నోటీసులకు రెండు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని పేర్కొంది సుప్రీంకోర్టు. దేశ పౌరుల మత విశ్వాసాలకు రాజ్యాంగ రక్షణ ఉంటుందని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు.
వందేమాతరం గీతానికి జనగణమణతో సమన హోదా కల్పించాలని..ఆరు చరణాలు తప్పనిసరిగా ఆలపించాలని ఇటీవల నిర్ణయం తీసుకుంది కేంద్రం.అంతే కాకుండా వందేమాతర గీతానికి అంతరాయం కలిగిస్తే మూడేళ్ళ వరకు జైలు శిక్ష విధించేలా చట్ట సవరణ తీసుకొచ్చింది కేంద్రం. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు టీఎం కృష్ణ.
వందేమాతరం చివరి నాలుగు చరణాల్లో మతపరమైన అంశాలు ఉన్నాయని.. వాటిని బలవంతంగా పాడించాలన్న కేంద్ర నిర్ణయం సరికాదని పిటిషన్లో పేర్కొన్నారు కృష్ణ. ఇది రాజ్యాంగం గాలించినా మాత స్వేచ్చకు, లౌకికత్వానికి, వ్యక్తిగత స్వేచ్చకు విరుద్ధమని అన్నారు.
